తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. పదేళ్ల పాలనలో పేదల కోసం ఏమీ చేయని బిఆర్ఎస్ పార్టీ తమ ఏడాది పాలనపై విమర్శలు చేయడం విడ్డూరమన్నారు. ఎన్నికల కోడ్ వల్ల మొదటి ఐదు నెలలు కార్యాలయానికి వెళ్ళలేకపోయామని, ఆ తరువాతి ఆరు నెలల్లో పరిపాలనను గాడిలో పెట్టామని తెలిపారు.
“కేటీఆర్, హరీష్ చిన్నపిల్లల మనస్తత్వంతో వ్యవహరిస్తున్నారు” అని రేవంత్ అన్నారు. “మన దగ్గర లేని బొమ్మ పక్కోడి దగ్గర ఉంటే విరగ్గొట్టాలని చిన్నపిల్లలు ప్రయత్నిస్తారు. అలానే బిఆర్ఎస్ నేతలు వ్యవహరిస్తున్నారు. వారికి అర్ధం కాకపోవచ్చు కానీ కెసిఆర్కి కూడా అవగాహన లేకపోవడం విచిత్రం” అని ఆయన ఎద్దేవా చేశారు. బిఆర్ఎస్ హయాంలో పేదల ఇళ్లకు ప్రాధాన్యత ఇవ్వలేదని రేవంత్ ఆరోపించారు. “కెసిఆర్ తన అవసరాలకు ప్రగతిభవన్, సచివాలయం, బిఆర్ఎస్ కార్యాలయాలు నిర్మించుకోవడంలో వేగంగా పని చేశారు. కానీ పేదల కోసం ఇళ్లు కట్టించడం గురించి ఎప్పుడూ ఆలోచించలేదు” అని విమర్శించారు.
“మేం ఏడాది లోపే అనేక పథకాలను అమలు చేశాం. ప్రజల సంక్షేమానికి మా పాలన కట్టుబడి ఉంది. BRS నేతల విమర్శలు అవాస్తవాలు” అని రేవంత్ స్పష్టం చేశారు. ఆర్థికంగా బలహీన వర్గాలకు అనేక కొత్త పథకాలు తీసుకురావడం తమ పాలన విజయమని తెలిపారు. ఇక మీదట కూడా పేదల సంక్షేమానికి తమ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని రేవంత్ హామీ ఇచ్చారు.