తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు పెద్దపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలో జరుగనున్న యువ వికాసం సభలో ముఖ్యమంత్రి పాల్గొనబోతున్నారు. ఈ కార్యక్రమంలో కొత్తగా ఉద్యోగాలు పొందిన 9,000 మందికి నియామక పత్రాలను ఆయన అందజేయనున్నారు. ప్రభుత్వ నిరుద్యోగుల భర్తీ ప్రక్రియలో భాగంగా ఈ నియామకాలు పూర్తి కావడం గమనార్హం.
ఈ సందర్బంగా పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. ఫోర్ లేన్ బైపాస్ రోడ్ నిర్మాణం, కొత్తగా ఏర్పాటు చేసే సబ్ స్టేషన్లు, ముఖ్యమంత్రి కప్ వంటి కార్యక్రమాలు ఈ పర్యటనలో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. అభివృద్ధి పనుల ద్వారా జిల్లాలో ట్రాన్స్‌పోర్ట్, విద్యుత్, క్రీడల రంగాల్లో మరింత పురోగతి సాధించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది.
సభాస్థలిలో ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు, ప్రజల రాకపోకలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక బందోబస్తును ఏర్పాటు చేశారు. వివిధ శాఖల అధికారులు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు సమన్వయం చేస్తున్నారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా పెద్ద సంఖ్యలో యువతీ, యువకులు పాల్గొనే అవకాశం ఉంది. పెద్దపల్లి పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ స్థానిక ప్రజలతోనూ కలిసి వారి సమస్యలను తెలుసుకోనున్నారు. ఈ సందర్బంగా జిల్లా అభివృద్ధికి సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకోవచ్చని సమాచారం. ముఖ్యమంత్రితో పాటు పలువురు మంత్రులు, అధికార ప్రతినిధులు ఈ పర్యటనలో పాల్గొంటారు.
ముఖ్యమంత్రి పర్యటన జిల్లాలో ప్రాధాన్యత పొందింది. పెద్దపల్లి అభివృద్ధి, యువత సంక్షేమంపై ఈ కార్యక్రమం శుభారంభం అవుతుందని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు ప్రజల జీవితాలలో గుణాత్మక మార్పులు తీసుకొస్తాయని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.