ప్రముఖ కమెడియన్ ఆలీకి భారీ షాక్ తగిలింది. తెలంగాణలోని వికారాబాద్ జిల్లా నవాబ్‌పేట్ మండలం ఎక్మామిడిలోని ఫామ్‌హౌస్‌లో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని గ్రామ కార్యదర్శి శోభారాణి ఆయనకు నోటీసులు జారీ చేసారు. అక్రమ నిర్మాణాలను వెంటనే నిలిపివేయాలని నోటీసులో పేర్కొన్నారు. ఈ నోటీసులపై అలీ తన తరఫు న్యాయవాది ద్వారా సమాధానం చెప్పేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. కావాలనే కొందరు తనపై కుట్రపూరితంగా ఇలా చేస్తున్నారని అలీ ఆరోపిస్తున్నారు.
వికారాబాద్ జిల్లా నవాబుపేట మండలంలోని ఎక్మామిడి గ్రామంలో నటుడు అలీకి వ్యవసాయ భూమి ఉంది. వీలు ఉన్నప్పుడు అలీ తన కుటుంబంతో కలిసి సరదాగా అక్కడికి వెళ్తుంటారు. ఈ క్రమంలో ఎక్మామిడి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న తన భూమిలో ఎలాంటి పర్మిషన్ లేకుండా అలీ నిర్మాణాలు చేపట్టారు. అధికారుల నుంచి ఎలాంటి అనుమతి తీసుకోకుండా అలీ ఫాం హౌస్ నిర్మించాడని అధికారుల దృష్టికి రావడంతో నోటీసులు జారీ అయ్యాయి. ఈ మేరకు ఎక్మామిడి గ్రామ పంచాయతీ సెక్రటరీ శోభారాణి అక్రమ నిర్మాణాల అంశంపై నటుడు అలీకి నోటీసులు జారీ చేశారు.