సుదీర్ఘంగా సాగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్దాన్ని అడ్డుకోవాల్సింది పోయి ఎగదోస్తున్న అగ్రరాజ్యం.. ఇప్పుడు ఆ యుద్ధం విషయంలో తటస్థంగా ఉంటున్న దేశాల్ని సైతం కెలుకుతోంది. ఇందులో భాగంగా యుద్దంలో రష్యాకు అండగా నిలుస్తున్న చమురు ఆదాయానికి గండి కొట్టేందుకు భారీ ఆంక్షలు విధించింది. దీని ప్రభావం ప్రపంచంలోనే అత్యంత జనాభా కలిగిన దేశాలైన భారత్, చైనాపై పడింది. రష్యాకు సహజ మిత్రులైన భారత్, చైనా గతంలో అమెరికా విధించిన ఆంక్షల్ని లెక్కచేయకుండా ఆ దేశం నుంచి చమురు కొన్నాయి. దీంతో తన అవసరాన్ని కూడా దృష్టిలో ఉంచుకుని రష్యా వీరిద్దరికీ డిస్కౌంట్ పై భారీగా చమురు అమ్మింది. ఇదంతా చూస్తూ వస్తున్న అమెరికా తాజాగా రష్యా చమురు రిఫైనరీలు, ఆ చమురును రవాణా చేసే నౌకలు, వారి ఇన్సూరెన్స్ సంస్థలపై భారీ ఆంక్షలు విధించింది.

ఈ నేపథ్యంలో భారత్, చైనాకు రష్యా చమురు సరఫరా నిలిచిపోతోంది. ఇన్నాళ్లూ రష్యా చమురు డిస్కౌంట్ పై వస్తుండటంతో మిగతా ప్రత్యామ్నాయాలపై పెద్దగా దృష్టిపెట్టని ఇరుదేశాలు ఇప్పుడు తప్పనిసరిగా ఆలోచనలో పడ్డాయి. ప్రత్యామ్నాయంగా తమకు చమురు సరఫరా చేసే మార్గాల కోసం అన్వేషిస్తున్నాయి. ఎలాగో అమెరికా కోపం రష్యాపైనే కాబట్టి ఇతర మార్గాల్లో చమురును తెచ్చుకోవాలని ఆలోచిస్తున్నాయి. ఈ ప్రభావం ధరలపై పడే అవకాశాలు కనిపిస్తోంది. గతంలో చమురు సరఫరా దేశాలైన గ్రూప్ ఆఫ్ సెవెన్ ఆంక్షలు, పరిమితుల వల్ల రష్యా నుంచి చమురు ఎగుమతులు రోజుకు 1.5 మిలియన్ బ్యారెల్స్ యూరప్ దేశాల నుంచి ఆసియాకు మళ్లించారు. అయితే అమెరికా తాజా ఆంక్షలు అమల్లోకి వచ్చినా 600 ట్యాంకర్ల రష్యా రహస్య నౌకల కారణంగా స్వల్పకాలిక ప్రభావాలను తగ్గించవచ్చని విశ్లేషకుల అంచనా . చైనా, రష్యా , సింగపూర్ సమీపంలో కనీసం 65 రష్యా ఆయిల్ ట్యాంకర్లు ఇప్పుడు చేరుకుని ఉన్నట్లు తెలుస్తోంది.