న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టబోతున్న డొనాల్డ్ ట్రంప్ గాజా ఉగ్రవాదులకు తీవ్ర హెచ్చరికలు జారీచేశారు. తాను అధ్యక్ష బాధ్యతలు స్వీకరించే నాటికి బందీలను విడిపెట్టాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇజ్రాయెల్-హమాస్ మధ్య 14 నెలల క్రితం ప్రారంభమైన యుద్ధం నేటికీ కొనసాగుతోంది. హమాస్ చెరలో ఉన్న బందీలను విడిపించే ఒప్పందాన్ని చేయడంలో బైడెన్ ప్రభుత్వం విఫలమైంది. ఈ నేపథ్యంలో ట్రంప్ తాజాగా ఈ హెచ్చరికలు చేశారు.
‘‘నేను అధ్యక్ష బాధ్యతలు స్వీకరించే జనవరి 20కి ముందు బందీలను విడుదల చేయకుంటే మధ్య ప్రాచ్యంలో ఈ దురాగతాలకు పాల్పడిన బాధ్యులు నరకయాతన అనుభవించాల్సి ఉంటుంది’’ అని ట్రంప్ తన సోషల్ మీడియా ‘ట్రూత్’ ద్వారా హమాస్‌ను పరోక్షంగా హెచ్చరించారు. బందీలను విడుదల చేయకుంటే చరిత్రలో ఇప్పటి వరకు చూడని పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని, కాబట్టి వెంటనే వారిని విడుదల చేయాలని సూచించారు.
ఇజ్రాయెల్‌పై ఒత్తిడి పెంచడానికి హమాస్ మిలటరీ విభాగమైన అల్ కస్సామ్ బ్రిగేడ్ ఓ వీడియోను విడుదల చేసింది. అందులో అమెరికా-ఇజ్రాయెల్ జాతీయుడైన 20 ఏళ్ల ఎడాన్ అలెగ్జాండర్ మాట్లాడారు. నేను గత 420 రోజులుగా హమాస్ చెరలో బందీగా ఉన్నాను. మేమంతా భయంతో రోజుకు వెయ్యిసార్లు చస్తున్నాం. మమ్మల్ని త్వరగా విడిపించండి అంటూ అలెగ్జాండర్‌లో అందులో అభ్యర్థించారు. ఈ వీడియోపై బాధితుడి తల్లి స్పందించింది. ఎడాన్‌తో సహా బందీలందరి విడుదలకు ప్రధాని నెతన్యాహూ ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని కోరారు. ఈ క్రమంలోనే డొనాల్డ్ ట్రంప్ ఆయన సోషల్ మీడియా అకౌంట్ ట్రూత్ సోషల్ వేదికగా హమాస్‌ను హెచ్చరించారు.