Harish Rao : తెలంగాణ కోసం తన ప్రాణాలను పణంగా పెట్టిన కేసీఆర్ చావును కోరుకోవడం ఎంత దారుణమని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో కేసీఆర్ చావును కోరుతూ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన హరీష్ రావు, దీనికి నిరసనగా శాసనసభలో సీఎం ప్రసంగాన్ని బహిష్కరించినట్లు తెలిపారు.

అసెంబ్లీలో పూర్తిగా అబద్ధాలు
అసెంబ్లీలో మీడియాతో చిట్‌చాట్ చేసిన హరీష్ రావు, కృష్ణా జలాల్లో తెలంగాణకు జరిగిన అన్యాయానికి పూర్తి బాధ్యత కాంగ్రెస్ పార్టీదేనని ఆరోపించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో పూర్తిగా అబద్ధాలు చెప్పారని విమర్శించారు. కాంగ్రెస్ నిర్లక్ష్యం వల్లే 299 టీఎంసీల కృష్ణా నీటి పంపకాలు జరిగాయని, నిజానికి తెలంగాణలో అంత నీటిని వినియోగించేందుకు తగినన్ని ప్రాజెక్టులే లేవని అన్నారు. కాంగ్రెస్ ప్రాజెక్టులను నిర్మించలేకపోవడమే ఈ అన్యాయానికి కారణమని పేర్కొన్నారు.
నీటిని కాపాడేందుకు పదవులను వదులుకున్నారు
పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు విషయంలో గతంలో కాంగ్రెస్ నేతలు ఒక్కరోజు కూడా వ్యతిరేకంగా మాట్లాడలేదని, అయితే తాము 40 రోజుల పాటు అసెంబ్లీని స్థంభింపజేశామని గుర్తుచేశారు. తెలంగాణ నీటిని కాపాడేందుకు తమ పార్టీ మంత్రుల పదవులను వదులుకున్నా, కాంగ్రెస్ నేతలు మాత్రం చంద్రబాబు దగ్గరకు వెళ్లి భోజనం చేసి వచ్చి కృష్ణా నీటిపై తాత్కాలిక నిర్ణయాలను ఆమోదించారని ఆరోపించారు.