Amit Shah : ఇందిరాగాంధీ హయాంలో తనను జైల్లో పెట్టారన్న అమిత్ షా ఇందిరా గాంధీ పరిపాలనలో తనకు వ్యతిరేకంగా విద్యార్థులంతా కలిసి ఉద్యమం నిర్వహించారని, ఆ సమయంలో తాను వారం రోజుల పాటు జైలులో ఉన్నానని కేంద్ర హోం మంత్రి అమిత్ షా వెల్లడించారు. అప్పట్లో తనపై కఠినంగా వ్యవహరించారని, భౌతిక దాడికి గురయ్యానని ఆయన ఆరోపించారు.

అసోంలోని డెర్గావ్‌లో ఏర్పాటు చేసిన లచిత్ బర్ఫుకాన్ పోలీస్ అకాడమీ ప్రారంభోత్సవంలో పాల్గొన్న అమిత్ షా, కాంగ్రెస్ హయాంలో రాష్ట్రంలో నిర్బంధాలను ఎదుర్కొన్నానని అన్నారు. అసోంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు శాంతి కోసం ఏమాత్రం కృషి చేయలేదని విమర్శించారు.
భాజపా అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం శాంతిని చవిచూసిందని, గత పదేళ్లలో భద్రతా పరిస్థితులు మెరుగయ్యాయని ఆయన వివరించారు. అశాంతి కారణంగా గతంలో తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడిన దాదాపు పది వేల మంది యువతీ, యువకులు ఆయుధాలను వదిలి సామాన్య జనజీవన స్రవంతిలో కలిశారని పేర్కొన్నారు.
మొఘలుల దురాగతాలకు వ్యతిరేకంగా పోరాడిన లచిత్ బర్ఫుకాన్ పేరును పోలీస్ అకాడమీకి పెట్టడం గర్వకారణమని అమిత్ షా అభిప్రాయపడ్డారు. చరిత్రను కేవలం అసోంకు పరిమితం చేయకుండా దేశవ్యాప్తంగా తెలియజేయాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు.