న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఢిల్లీ బీజేపీ విజయం దిశగా దూసుకెళ్లింది. భారీ మెజార్టీతో ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ దాటేసింది. ఈ నేపథ్యంలో బీజేపీ నుంచి ఢిల్లీ ముఖ్యమంత్రి ఎవరు? అనే చర్చ నడుస్తోంది. బీజేపీ నుంచి ముఖ్యంగా కొందరి పేర్లు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో మోడీ మార్క్ రాజకీయాల్లో భాగంగా మహిళకు అవకాశం ఇస్తారా? అనే విషయం తెరపైకి వచ్చింది.
ఈ క్రమంలోనే ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడిగా ప్రస్తుతం వీరేంద్ర సచ్‌దేవా కొనసాగుతున్నారు. ఆయన సీఎం రేసులో ముందు వరుసలో ఉన్నా రు. తాజాగా ఆయన మాట్లాడుతూ.. ఢిల్లీ సీఎం పోస్టుపై అగ్రనాయకత్వం నిర్ణయమే ఫైనల్. అది మాకు పెద్ద సమస్య కాదు. ఆప్‌ను ఓడించడమే మా లక్ష్యం అంటూ కామెంట్స్ చేశారు. అయితే, హర్యానా, మహారాష్ట్రలో బీజేపీ నాయకత్వం వ్యూహాత్మకంగా ముఖ్యమంత్రిని ఖరారు చేసింది. పార్టీ సమావేశం.. ఆ తరువాతనే సీఎంను ప్రకటించింది. ఇప్పుడు కూడా అదే తరహాలో నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది.

మరోవైపు.. మహిళా సీఎం ఉంటారనే వాదన అనూహ్యంగా తెర మీదకు రావటంతో కొత్త సమీకరణాలపైన చర్చ జరుగుతోంది. 1993లో ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వచ్చిన సమయంలో సుష్మా స్వరాజ్ కేంద్ర మంత్రిగా రాజీనామా చేసి ఢిల్లీ సీఎంగా బాధ్యతలు అప్పగించారు. మరోసారి మహిళకే సీఎం పగ్గాలు ఇవ్వాలని నిర్ణయిస్తే రేసులో స్మృతి ఇరానీ, మీనాక్షి లేఖి, బన్సూరి స్వరాజ్ పేర్లను బీజేపీ అధిష్టానం పరిశీలించే అవకాశం ఉంది. అదే సమయంలో ఎంపీ మనోజ్ తివారీ, పర్వేశ్ వర్మ, రమేశ్ బిధూరి కూడా సీఎం రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. మనోజ్ తివారీ, వీరేంద్ర సచ్‌దేవా, పర్వేశ్ వర్మలలో ఒకరిని సీఎంగా, మిగతా ఇద్దరినీ డిప్యూటీ సీఎంలుగా ఎంపిక చేసే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అదే విధంగా ఎన్నికల ప్రచారంలోనూ మహిళా ఓటర్లే లక్ష్యంగా హామీలు గుప్పించిన విషయం తెలిసిందే.