అమెరికాలో నివసించే అక్రమ వలసదారులు, వారిని తరలించిన విధానం దేశ రాజకీయాల్లో చిచ్చుపెట్టింది. దీనిపై కాంగ్రెస్ సారథ్యంలోని ప్రతిపక్షాల ఉమ్మడి సంకీర్ణ కూటమి ఇండియా తీవ్ర అభ్యంతరాన్ని తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన వైఖరేంటో తెలియజేయాలంటూ పట్టుబట్టింది. సమగ్ర చర్చ జరగాలంటూ డిమాండ్ చేస్తోంది. ఈ పరిస్థితుల మధ్య అమెరికా ఓ వీడియోను విడుదల చేసింది. ఈ రాజకీయ రచ్చకు మరింత ఆజ్యం పోసేలా ఉందా వీడియో. అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ చీఫ్ మైఖెల్ డబ్ల్యూ బ్యాంక్స్ దీన్ని విడుదల చేశారు. తన అధికారిక ఎక్స్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు.
అమెరికా ఆర్మీకి చెందిన సీ-17 విమానాన్ని ఎక్కుతున్నప్పుడు చిత్రీకరించిన వీడియో ఇది. 24 సెకెండ్ల నిడివి ఉన్న ఈ వీడియో భారత అక్రమవలసదారుల పట్ల ఆ దేశం ఎంత అమానవీయంగా ప్రవర్తించిందనే విషయానికి అద్దం పట్టింది. అక్రమవలస దారుల కాళ్లకు గొలుసులు, చేతులకు బేడీలు వేసి ఉండటం ఇందులో కనిపించింది. అమెరికా చర్య- దేశ సార్వభౌమతాన్ని ప్రశ్నించినట్టయిందని వ్యాఖ్యానించారు. దౌత్యపరంగా కేంద్ర ప్రభుత్వం తన నిరసనను తెలియజేయాల్సిన అవసరం ఉందని అన్నారు. వాళ్లేమీ క్రిమినల్స్ కాదని గుర్తు చేశారు. దీనిపై చర్చించడానికీ కేంద్రానికి తీరిక దొరకట్లేదంటూ విమర్శించారు.