MMTS : హైదరాబాద్ ఎంఎంటీఎస్ ట్రెయిన్‌లో అత్యాచారయత్నం కేసును పోలీసులు ఛేదించారు. అమ్మాయిపై అత్యాచారయత్నానికి పాల్పడిన వ్యక్తిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. మేడ్చల్ జిల్లా గౌడవెల్లికి చెందిన జంగం మహేష్ అనే యువకుడు ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్లు గుర్తించారు. తల్లిదండ్రులు చనిపోవడంతో ఒంటరిగా ఉంటుంన్న మహేష్ గంజాయికి బానిసై నేరాలకు పాల్పడుతున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో ఈనెల 23న ఎంఎంటీఎస్ ట్రైన్ ఎక్కిన మహేష్ ఒంటరిగా ఉన్న అమ్మాయిపై అఘాయిత్యం చేసేందుకు ప్రయత్నించాడు. అతడి బారి నుంచి తప్పించుకునే క్రమంలో ట్రైన్ నుంచి దూకి ఆమె తీవ్రంగా గాయపడింది. మహేష్ ఫోటోను ట్రీట్‌మెంట్ తీసుకుంటుంన్న అమ్మాయికి చూపించగా నిందితుడు అతడే అని గుర్తించింది. దీంతో పోలీసులు మహేష్‌ను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.

ఈ ఘటనపై ప్రతిపక్ష నేతలు తీవ్ర ఆగ్రహం
కాగా, ఎంఎంటీఎస్ అత్యాచారయత్నం ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అనంతపురం జిల్లాకు చెందిన ఓ యువతి ఈనెల 23న సికింద్రాబాద్ నుంచి మేడ్చల్‌కు వెళ్లేందుకు ఎంఎంటీఎస్ ట్రైన్‌లోకి ఎక్కగా.. ఒంటరిగా ఉన్న ఆమెపై ఓ దుండగులు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. దీంతో కదులుతున్న ట్రైన్ నుంచి ఆమె కిందకు దూకగా.. తీవ్ర గాయాలతో గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటనపై ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవని ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయిందని మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా అత్యాచార ఘటనపై కీలక అప్డేట్ వ్చచింది. ఈ కేసులో పోలీసులు పురోగతి సాధించారు.