బుల్లితెర యాంకర్ విష్ణుప్రియ గురువారం ఉదయం పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. తన అడ్వొకేట్ తో కలిసి ఉదయం పది గంటల ప్రాంతంలో స్టేషన్ కు వెళ్లారు. బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ కు సంబంధించిన కేసులో విచారణకు హాజరయ్యారు. వాస్తవానికి ఈ కేసులో మంగళవారం విచారణకు రావాలంటూ పంజాగుట్ట పోలీసులు నోటీసులు జారీ చేయగా.. షూటింగ్ కారణంగా విష్ణుప్రియ ఆ రోజు గైర్హాజరయ్యారు. తన తరఫున శేఖర్ భాషాను పోలీస్ స్టేషన్ కు పంపించారు. ఈ క్రమంలోనే గురువారం ఉదయం విష్ణుప్రియ విచారణకు హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్ ల కారణంగా చాలామంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు.

సోషల్ మీడియా వేదిక ద్వారా ఫైట్ చేస్తున్న ఆర్టీసీ ఎండీ సజ్జనార్
ఎంతోమంది అప్పుల ఊబిలో చిక్కుకుని దిక్కుతోచని పరిస్థితిలో పడ్డారు. ఈ యాప్స్ కు సెలబ్రెటీలు, సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లు ప్రమోషన్ చేయడంపై ఐపీఎస్ అధికారి, తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సోషల్ మీడియా వేదిక ద్వారా ఫైట్ చేస్తున్న విషయం తెలిసిందే. సజ్జనార్ ట్వీట్లతో ఏపీ, తెలంగాణ పోలీసులు స్పందించి సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లపై కేసులు పెడుతున్నారు. తాజాగా 11 మంది ఇన్ ఫ్లూయెన్సర్లపై కేసు నమోదు చేసిన తెలంగాణ పోలీసులు.. విచారణకు రమ్మంటూ వారికి నోటీసులు పంపించారు. ఇందులో యాంకర్లు విష్ణుప్రియ, శ్యామలతో పాటు పలువురు యూట్యూబర్లు, ఇన్ ఫ్లూయెన్సర్లు ఉన్నారు.
చాలామంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు
తెలుగు రాష్ట్రాల్లో ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల కారణంగా చాలామంది ఆత్మహత్యలకు పాల్పడినట్లు నివేదికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో, ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తున్న సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాలు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ కూడా ఈ విషయంపై స్పందిస్తూ, బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేయడం చట్టరీత్యా నేరమని, ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులు శిక్షార్హులని హెచ్చరించారు.