ఇటీవల అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్.. ఉపాధ్యక్షుడిగా తెలుగింటి అల్లుడు జేడీ వాన్స్ ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం ట్రంప్ ప్రసంగిస్తూ.. అమెరికా సెకెండ్ లేడీ.. తెలుగింటి ఆడపడుచు ఉషా చిలుకూరిపై ప్రశంసలు కురిపించారు. ‘చాలాకాలంగా నేను జేడీ వాన్స్‌ను చూస్తున్నా. ఓహియో సెనేటర్‌గా పోటీ చేసినప్పుడు ఆయనకు నా మద్దతు తెలిపాను… ఆయన గొప్ప సెనేటర్. ఆయన భార్య ఉషా చిలుకూరి చాలా తెలివైన వారు.. కడు నేర్పరి.. వాస్తవానికి ఉపాధ్యక్ష పదవికి ఉషానే ఎంపిక చేయాల్సి ఉంది.. కానీ నిబంధనలు కారణంగా కుదరలేదు.. వాన్స్ దంపతులిద్దరూ గొప్పవారు’ అంటూ ట్రంప్ పొగడ్తల్లో ముంచెతారు.

అమెరికా నూతన ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సతీమణి ఉషా చిలుకూరి తల్లిదండ్రులు రాధాకృష్ణ, లక్ష్మీ చిలుకూరి ఆంధ్రప్రదేశ్ నుంచి అమెరికాకు వలసవెళ్లి అక్కడే స్థిరపడ్డారు. ఆంధ్రా యూనివర్సిటీ విశ్రాంత ప్రొఫెసర్ డాక్టర్ శాంతమ్మకు ఆమె మనవరాలు అవుతారు. ఏరో నాటికల్ ఇంజినీరైన రాధాకృష్ణ, బయో కెమిస్ట్రీ రంగ నిపుణురాలైన లక్ష్మి… 1980ల్లోనే అమెరికా వలస వెళ్లారు. వీరి ఇద్దరి పిల్లల్లో ఉష ఒకరు. కాలిఫోర్నియాలోని శాండియాగోలో 1986లో జన్మించిన ఉష.. యేల్ యూనివర్సిటీ నుంచి చరిత్రలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేశారు. కేంబ్రిడ్జి నుంచి ఫిలాసఫీలో మాస్టర్స్ డిగ్రీ అందుకున్నారు. యేల్ వర్సిటీలోని న్యాయ సంబంధ విభాగాల్లో సుదీర్ఘంగా పనిచేశారు. తొలిసారి యేల్ వర్సిటీలోనే ఉషకు వాన్స్ పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం స్నేహంగా మారి ఒకరినొకరు ఇష్టపడ్డారు. 2014లో కెంటకీలో హిందూ సంప్రదాయం ప్రకారం వాన్స్‌ను పెళ్లి చేసుకున్నారు.