ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాల్లో వాతావరణం మారుతోంది. ఎండలు, వడగాలులు, అకాల వర్షాలు, పిడుగులు ఇలా భిన్నమైన వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని ప్రాంతాల్లో ఎండలు ఎక్కువవుతున్నప్పటికీ, మరికొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశముందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు.ఉత్తరాంధ్ర జిల్లాల్లో నేడు, రేపు తేలికపాటి వర్షాలు కురవడానికి అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. కొన్ని చోట్ల పిడుగుల పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది.
అధిక ఉష్ణోగ్రత
శనివారం రాత్రి 8 గంటల సమయం లో కాకినాడ జిల్లా వేలంకలో 56.2 మిల్లీ మీటర్ల మేర వర్షం కురిసింది. ఏలేశ్వరంలో 48.5, కోటనందూరులో 45.2, అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో 44.5 మిల్లీ మీటర్ల మేర వర్షపాతం నమోదైంది. అలాగే రాష్ట్రవ్యాప్తంగా 33 ప్రాంతాల్లో కనిష్టంగా 20 మిల్లీ మీటర్ల వరకు వర్షపాతం రికార్డు అయ్యింది. అనకాపల్లి జిల్లా లో 39.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. నంద్యాల గోపవరం, శ్రీకాకుళం పొందూరులో 39.7 డిగ్రీలు చొప్పున అధిక ఉష్ణోగ్రత రికార్డు అయ్యింది. సాధారణ ఉష్ణోగ్రతతో పోల్చుకుంటే ఇది రెండు నుంచి మూడు డిగ్రీలు తక్కువనే అంచనాలు వ్యక్తమౌతోన్నాయి. వర్షాల వల్ల ఎండ తీవ్రత కొంత తగ్గినట్టయింది. నేడు ఉత్తరాంధ్రలో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడటానికి అవకాశాలు ఉన్నాయని విపత్తు నిర్వహణ సంస్థ పేర్కొంది. కాకినాడ జిల్లాలో అక్కడక్కడ మోస్తారు వర్షాలు పడొచ్చని రోణంకి కూర్మనాథ్ తెలిపారు. మరోవైపు ఎండ తీవ్రత కూడా క్రమంగా పెరిగే అవకాశం ఉందని తెలిపారు.

ఈదురుగాలులతో వర్షాలు
పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్లు క్రింద, పోల్స్, టవర్స్ క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదన్నారు. వ్యవసాయ పనుల్లో ఉన్నవాళ్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.సురక్షిత భవనాల్లో ఆశ్రయం పొందాలని సూచించారు.మహారాష్ట్ర నుండి కర్ణాటక మీదుగా తమిళనాడు వరకు సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతోందని వాతావరణశాఖ తెలిపింది.సోమవారం తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం జిల్లాలలో అక్కడక్కడ గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం,ఈ మేరకు తెలంగాణలోని పది జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు వాతావరణశాఖ అధికారులు.