Karimnagar Crime: మగపిల్లాడు పుట్టలేదని ఇంత దారుణమా? భార్య గొంతు నులిమి చంపిన భర్త

Follow Us: Google News Daily Hunt
Karimnagar Crime
Karimnagar Crime
FONT SIZE
GET APP

Karimnagar Crime: మగపిల్లాడు పుట్టలేదన్న ఒకే ఒక్క ఆక్రోశం.. 18 ఏళ్లుగా కష్టసుఖాల్లో తోడున్న భార్య ప్రాణాలనే బలితీసుకుంది. పెళ్లయిన 12 ఏళ్లకు కడుపు పండి ఆడపిల్ల పుట్టినా సంతృప్తి చెందక, తనకు మగ సంతానమే కావాలంటూ ఏళ్ల తరబడి కట్టుకున్న భార్యను శారీరకంగా, మానసికంగా తీవ్రంగా చిత్రహింసలకు గురిచేశాడో భర్త. చివరకు “మీ అమ్మాయిని తీసుకెళ్లకపోతే చంపేస్తాను” అని అత్తమామలకు ఫోన్ చేసి బెదిరించిన కొన్ని గంటల్లోనే, భార్యను అత్యంత కిరాతకంగా గొంతు నులిమి హతమార్చాడు. కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసిన ఈ విషాదకర ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

Read Also : Vadarevu fishermen missing : బాపట్ల జిల్లాలో విషాదం.. చేపల వేటకు వెళ్లి ఐదుగురు మత్స్యకారులు గల్లంతు!

Karimnagar Crime
Is it so terrible not to have a baby boy? Husband strangles wife to death

Karimnagar Crime: పెళ్లయిన 12 ఏళ్లకు సంతానం.. ఆగని వేధింపులు

పోలీసుల కథనం ప్రకారం.. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం లాలపల్లి గ్రామానికి చెందిన నాతరి చంద్రయ్య తన కూతురు స్వరూపను సుమారు 18 ఏళ్ల క్రితం కరీంనగర్‌కు చెందిన దావు చంద్రకుమార్‌కు ఇచ్చి వివాహం జరిపించారు. పెళ్లయిన దాదాపు 12 ఏళ్ల వరకు వీరికి పిల్లలు కలగలేదు. దీంతో “పిల్లలు పుట్టడం లేదు.. నేను మరో పెళ్లి చేసుకుంటాను” అని చంద్రకుమార్ తరచూ స్వరూపను హింసించేవాడు. ఆ తర్వాత స్వరూపకు ఒక ఆడపిల్ల జన్మించినప్పటికీ అతడి ప్రవర్తనలో మార్పు రాలేదు. తనకు కేవలం మగ సంతానమే కావాలంటూ వేధింపులు మరింత ఎక్కువ చేశాడు. నిత్యం మద్యం తాగి వచ్చి కొట్టడం, అర్ధరాత్రి వేళ పుట్టింటి వద్ద వదిలివెళ్లడం పరిపాటిగా మారింది. గ్రామ పెద్దలు పలుమార్లు పంచాయితీలు పెట్టి నచ్చజెప్పినా అతడి తీరు మారలేదు.

బెదిరించిన కొన్ని గంటల్లోనే దారుణం!

సంఘటన జరిగిన రోజు రాత్రి 9 గంటల సమయంలో చంద్రకుమార్ భార్యను తీవ్రంగా కొడుతూ ఆమె తల్లిదండ్రులకు ఫోన్ చేశాడు. “మీ అమ్మాయిని తీసుకెళ్లండి.. లేదంటే చంపేస్తాను” అని బెదిరింపులకు దిగాడు. ఆ తర్వాత అర్ధరాత్రి 12 గంటల సమయంలో చంద్రకుమార్ ఇల్లు వదిలి ఒంటరిగా వెళ్ళిపోవడాన్ని పొరుగువారు గమనించారు.

మరుసటి రోజు ఉదయం స్వరూప మంచంపై అపస్మారక స్థితిలో పడి ఉండటంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. ఆమె మెడపై తీవ్రమైన గీతలు, కమిలిన గాయాలు కనిపించాయి. వెంటనే ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే స్వరూప మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

కేసు నమోదు.. నిందితుడి కోసం పోలీసుల గాలింపు

తన కుమార్తె స్వరూపను ఆమె భర్త చంద్రకుమారే పథకం ప్రకారం గొంతు నులిమి హత్య చేశాడని తండ్రి చంద్రయ్య కరీంనగర్ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆన్‌సైట్ ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. మృతదేహానికి పంచనామా, పోస్టుమార్టం పూర్తి చేసిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు.

ఈ దారుణ ఘటనపై కేసు నమోదు చేసి లోతుగా దర్యాప్తు చేపట్టామని, ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుడు చంద్రకుమార్‌ను త్వరలోనే పట్టుకుని చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని కరీంనగర్ రూరల్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఏ. నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

Saritha

రచయిత గురించి

Saritha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మీకు నచ్చవచ్చు