వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంబీఏ, ఎంసీఏ కోర్సులలో ప్రవేశాలకు సంబంధించి ఐసెట్ 2025 ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు మహాత్మాగాంధీ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్, ఐసెట్ కన్వీనర్, ఎంజీయూ రిజిస్ర్టార్ ప్రొఫెసర్ అల్వాల రవి సంయుక్తంగా నోటిఫికేషన్ విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థల్లో 2025-26 విద్యా సంవత్సరానికి ఎంబీఏ, ఎంసీఏ కోర్సులలో ప్రవేశాల కోసం ఐసెట్ 2025 ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్ష నిర్వహణ బాధ్యతలను తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ యూనివర్సిటీకి అప్పగించారు. నల్గొండలోని ఎంజీయూ వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్, ఐసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ అల్వాల రవి ఈ నోటిఫికేషన్‌ను గురువారం (మార్చి 6) విడుదల చేశారు.

పరీక్ష విధానం
ఈసారి ఐసెట్ 2025 పరీక్షను పూర్తిగా ఆన్‌లైన్ విధానంలో నిర్వహించనున్నారు. మొత్తం 4 షిఫ్టులలో 2 రోజులపాటు పరీక్షలు ఉంటాయి. ఉదయం సెషన్: 10:00 AM – 12:30 PM మధ్యాహ్నం సెషన్: 2:30 PM – 5:00 PM ఈసారి తెలంగాణ ఉన్నత విద్యా మండలి TG PECET, TG EdCET వంటి ప్రవేశ పరీక్షల నిర్వహణ బాధ్యతలను మహాత్మాగాంధీ యూనివర్సిటీకి అప్పగించింది. ఐసెట్ 2025 పరీక్షలో మొత్తం 200 ప్రశ్నలు ఉంటాయి. ఇది ఒబ్జెక్టివ్ మల్టిపుల్ చాయిస్ ప్రశ్నల విధానంలో ఉంటుంది. అంకగణితం & గణిత నైపుణ్యం – 75 మార్కులు ఆంగ్ల నైపుణ్యం – 75 మార్కులు డేటా ఇంటర్ప్రిటేషన్ & లాజికల్ రీజనింగ్ – 50 మార్కులు మొత్తం పరీక్ష సమయం: 150 నిమిషాలు. ప్రతి ప్రశ్నకు 1 మార్కు. నెగటివ్ మార్కింగ్ లేదు.
దరఖాస్తు ప్రక్రియ
అభ్యర్థులు తెలంగాణ ఐసెట్ అధికారిక వెబ్‌సైట్‌లో (https://tsicet.nic.in) ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తుకు అవసరమైన పత్రాలు:
10వ తరగతి మెమో
ఇంటర్/డిగ్రీ మెమో
ఆధార్ కార్డు
కేటగిరీ ధృవపత్రం (SC/ST/BC అభ్యర్థుల కోసం)
పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో
సిగ్నేచర్ (డిజిటల్ ఫార్మాట్‌లో)
ఐసెట్ 2025 – ముఖ్యమైన తేదీలు
- ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: మార్చి 10, 2025
- ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: మే 3, 2025
- రూ.250 అపరాధ రుసుముతో దరఖాస్తుకు చివరి తేదీ: మే 17, 2025
- రూ.500 అపరాధ రుసుముతో దరఖాస్తుకు చివరి తేదీ: మే 26, 2025
- దరఖాస్తు సవరణ తేదీలు: మే 16 నుంచి 20, 2025
- పరీక్ష తేదీలు: జూన్ 8, 9, 2025
- ప్రాథమిక ఆన్సర్ కీ విడుదల: జూన్ 21, 2025
- కీపై అభ్యంతరాల స్వీకరణ: జూన్ 22 నుంచి 26, 2025
- ఫలితాల విడుదల: జులై 7, 2025
పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ విడుదల చేయబడుతుంది. ఈ మెరిట్ ఆధారంగా కౌన్సెలింగ్ నిర్వహించబడుతుంది. మెరిట్ లిస్ట్ ప్రకారం అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాలి. కళాశాలలు, కోర్సులను ఎంపిక చేసుకోవాలి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత అలాట్‌మెంట్ లేఖ లభిస్తుంది. అభ్యర్థులు తుది అడ్మిషన్ పొందటానికి కళాశాలలో రిపోర్ట్ చేయాలి. తెలంగాణలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సులలో ప్రవేశం పొందాలనుకునే విద్యార్థులందరికీ ఐసెట్ 2025 ముఖ్యమైన ప్రవేశ పరీక్ష. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మార్చి 10 నుంచి ప్రారంభమవుతుంది. కాబట్టి, అర్హత కలిగిన అభ్యర్థులు నిర్దేశిత సమయానికి దరఖాస్తు చేసుకొని విద్యా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి