హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)లో విద్యార్థుల ఆందోళనలు, ర్యాలీలు, అరెస్టులతో గత కొన్ని రోజులుగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వివాదాస్పద భూవిషయంలో విద్యార్థులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగిస్తున్నారు.విద్యార్థులు చెబుతున్న ప్రకారం, యూనివర్సిటీ భూసంపదను రాష్ట్ర ప్రభుత్వం ఐటీ అభివృద్ధి పేరుతో ప్రైవేటు సంస్థలకు విక్రయించాలని చూస్తోందని ఆరోపిస్తున్నారు. అయితే, ప్రభుత్వం మాత్రం ఈ భూములు తమ పరిధిలోకి వస్తాయని స్పష్టం చేసింది.
విద్యార్థులు ఆందోళన
కంచ గచ్చిబౌలిలోని సర్వే నం.25లో 400 ఎకరాలను తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టీజీఐఐసీ) ద్వారా అభివృద్ధి చేసి, ఐటీ సంస్థలకు కేటాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గతేడాది నిర్ణయం తీసుకుంది. యూనివర్సిటీ భవనాలను ఆనుకుని ఉండటంతో, ఈ భూములు వర్సిటీకి చెందినవేనని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఈ వివాదం నేపథ్యంలో విద్యార్థుల ఆందోళనలో విద్యావేత్తలతో పాటు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు కూడా తమ మద్దతు ప్రకటిస్తున్నారు.ఈ వివాదంపై ఇప్పటికే ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్, డైరెక్టర్ తరుణ్ భాస్కర్, నటుడు ప్రియదర్శి, దర్శకుడు వేణు ఉడుగుల, సంగీత దర్శకుడు మణిశర్మ, యాంకర్ రష్మీ గౌతమ్, ఈషా రెబ్బా తదితరులు కూడా స్పందించారు.ఈ వివాదం నేపథ్యంలో సుప్రీంకోర్టు స్పందించింది.
సుప్రీంకోర్టు ఆగ్రహం
కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూముల వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వంపై భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు చర్యలు నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ ఈరోజు మధ్యాహ్నం మధ్యంతర నివేదికను పంపించారు. హైకోర్టు నివేదికను జస్టిస్ గవాయ్ ధర్మాసనం పరిశీలించింది. చట్టాన్ని చేతుల్లోకి ఎలా తీసుకుంటారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఇది చాలా తీవ్రమైన అంశమని పేర్కొంది.

సమాధానం చెప్పాలి
కంచ గచ్చిబౌలి వ్యవహారానికి సంబంధించి వార్తా కథనాలను అమికస్ క్యూరీ జస్టిస్ గవాయ్ ధర్మాసనం ముందు ప్రస్తావించారు. ఈ కేసులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని సుప్రీంకోర్టు ప్రతివాదిగా చేర్చింది.ఆ భూమిలో అత్యవసరంగా కార్యకలాపాలు చేపట్టాల్సిన అవసరం ఏమి వచ్చిందని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఒకవేళ అది అటవీ ప్రాంతం కాకపోయినప్పటికీ, చెట్లు కొట్టే ముందు అనుమతులు తీసుకున్నారా అని అడిగింది. ఒక్కరోజులో వందల ఎకరాల్లో చెట్లు కొట్టేయడం సాధారణ అంశం కాదని వ్యాఖ్యానించింది. తమ ప్రశ్నలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమాధానం చెప్పాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈ నెల 16వ తేదీకి వాయిదా వేసింది.
విచారణ
ఇదే విషయంపై అటు ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. ఈ వివాదంపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరుగుతోందని సుప్రీంకోర్టుకు వివరించారు. అయితే హైకోర్టులో జరిగే విచారణపై తాము ఎలాంటి స్టే ఇవ్వడం లేదని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ స్పష్టం చేశారు.