భూమికి సుదూరంగా ఎక్కడో అంతరిక్ష కేంద్రంలో 286 రోజుల పాటు గడిపిన భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్.. క్షేమంగా తిరిగివచ్చారు. తోటి వ్యోమగామి బ్యారీ బుచ్ విల్మోర్‌తో కలిసి భూమండలానికి చేరుకున్నారు. అమెరికాలోని ఫ్లోరిడాలో ల్యాండ్ అయ్యారు.
ఫ్లోరిడాలో గల నాసా కెన్నెడీ స్పేస్ సెంటర్ చేరుకున్నారు
భారత కాలమానం ప్రకారం ఈ తెల్లవారు జామున సరిగ్గా 3:27 నిమిషాలకు స్పేస్ ఎక్స్‌కు చెందిన డ్రాగన్ క్యాప్సుల్ క్రూ- 9.. ఫ్లోరిడాలో గల నాసా కెన్నెడీ స్పేస్ సెంటర్‌కు చేరుకుంది. అక్కడి నుంచి వారిద్దరినీ టెక్సాస్‌లోని హ్యూస్టన్‌లో నాసాకు చెందిన జాన్సన్ స్పేస్ సెంటర్‌కు తీసుకెళ్లారు. 45 రోజుల పాటు అక్కడే రిహాబిలిటేషన్‌లో గడపనున్నారు. ఫ్లోరిడా తీరంలో స్పేస్‌ఎక్స్ డ్రాగన్ క్యాప్సూల్ నేరుగా సముద్రంలో దిగింది. లక్షలాది మంది నాసా యూట్యూబ్ లైవ్ స్ట్రీమింగ్ ద్వారా దీన్ని వీక్షించారు. భూ వాతావరణంలోకి తిరిగి ప్రవేశించిన కొద్ది నిమిషాలకే ఈస్టర్న టైమ్ జోన్ ప్రకారం..సాయంత్రం 5:57 నిమిషాలకు క్యాప్సూల్ సురక్షితంగా నీటిలో దిగింది. ఆ వెంటనే నాసా కంట్రోల్ రూమ్‌లో హర్షాతిరేకాలు వెల్లువెత్తాయి.
ఈ క్యాప్సూల్‌లో వున్నవారు సునీత విలియమ్స్, బ్యారి విల్మోర్..
అమెరికన్ వ్యోమగామి సునీత విలియమ్స్, బ్యారి విల్మోర్‌తో పాటు నిక్ హేగ్, రష్యన్ వ్యోమగామి అలెగ్జాండర్ గోర్బునోవ్ ఈ క్యాప్సూల్‌లో ఉన్నారు. ఈ క్యాప్సుల్ భూ కక్ష్యలోకి ప్రవేశించే సమయంలో కొద్దిసేపు కమ్యూనికేషన్ బ్లాక్ అవుట్ ఏర్పడింది. నాసా దాన్ని క్షణాల్లోనే పునరుద్ధరించగలిగింది. తొలుత నిగ్ హేగ్ నాసాను ఉద్దేశించి మాట్లాడారు. ఇదొక అద్భుత ప్రయాణంగా అభివర్ణించారు. దాదాపుగా 2,000 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో ఈ డ్రాగన్ క్యాప్పుల్ భూ కక్ష్యలోకి ప్రవేశించింది. సముద్ర జలాల్లోకి క్యాప్సుల్ దిగిన వెంటనే నాసాకు చెందిన రికవరీ టీమ్ అలర్ట్ అయింది. వారిని అందులో నుంచి సురక్షితంగా బయటికి తీసుకొచ్చింది.