CBG Plant: ప్రకాశం జిల్లా పీసీ పల్లి మండలం దివాకరపల్లి సమీపంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఏర్పాటు చేయనున్న కంప్రెస్డ్ బయో గ్యాస్ (సీబీజీ) ప్లాంటుకు మంత్రి నారా లోకేశ్ బుధవారం భూమిపూజ నిర్వహించనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్ తెలిపారు. బయో ఫ్యూయల్ ఉత్పత్తిలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపేందుకు ఈ ప్రాజెక్టు కీలకంగా మారనుంది. ప్రాజెక్టు కోసం రిలయన్స్ సంస్థ రూ.65 వేల కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ఈ నిధులతో మొత్తం 500 సీబీజీ ప్లాంట్లను ఏర్పాటు చేయనుంది. దీని ద్వారా సుమారు 2.5 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఈ ప్లాంట్ల ద్వారా వ్యవసాయ వ్యర్థాలను ఉపయోగించి హరిత, పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ప్రతి సీబీజీ ప్లాంట్ రోజుకు 22 టన్నుల ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉంటుంది. నిరుపయోగంగా ఉన్న దాదాపు 5 లక్షల ఎకరాల భూమిని ఎనర్జీ ప్లాంటేషన్ కోసం వినియోగిస్తాం అని విజయానంద్ వెల్లడించారు.

సీబీజీ పెట్టుబడుల ద్వారా గ్రామాల్లో ఆర్థిక కార్యకలాపాలు
2035 నాటికి కర్బన ఉద్గారాలను సున్నా స్థాయికి తీసుకురావడమే లక్ష్యంగా.. సంప్రదాయేతర ఇంధన వనరుల అభివృద్ధిని ప్రోత్సహిస్తున్నామని మంత్రి లోకేశ్ తెలిపారు. ఇందులో భాగంగా రిలయన్స్ మొదటి సీబీజీ ప్లాంటును ప్రకాశం జిల్లాలో ఏర్పాటు చేస్తోందన్నారు. సీబీజీ ప్లాంట్లలో వ్యవసాయ అవశేషాలు, పారిశ్రామిక వ్యర్థాలు, మున్సిపల్ ఘన వ్యర్థాలను వినియోగిస్తారు. రిలయన్స్ దేశంలో నాలుగు సీబీజీ హబ్‌లను ఏర్పాటు చేయనుండగా.. అందులో ఒకటి ప్రకాశం జిల్లాలో ఏర్పాటుకు నిర్ణయించింది. సీబీజీ ప్లాంట్ల ద్వారా ఉత్పత్తి అయ్యే 110 లక్షల టన్నుల సేంద్రీయ ఎరువు ద్వారా 15 లక్షల ఎకరాల భూములను సారవంతంగా మార్చేందుకు వెసులుబాటు కలుగుతుంది. సీబీజీ పెట్టుబడుల ద్వారా గ్రామాల్లో ఆర్థిక కార్యకలాపాలు మెరుగవుతాయి అని లోకేశ్ పేర్కొన్నారు.