కుటుంబ పాలనకు కేరాఫ్ అడ్రస్ ఎనుముల రేవంత్ రెడ్డి
హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ డైరెక్షన్‌లో సీఎం రేవంత్ రెడ్డి కలిసి పని చేస్తున్నారు.. ఆయన ఆర్ఎస్ఎస్ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్‌లో ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడారు. ప్రతీ విషయంలో బీజేపీతో సీఎం రేవంత్ రెడ్డి కలిసి పనిచేస్తున్నారు. అహంకారానికి, కుటుంబ పాలనకు కేరాఫ్ అడ్రస్ ఎనుముల రేవంత్ రెడ్డి. బీజేపీ నాయకులే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దగ్గరుండి కాపాడుతున్నారు. మేము వాస్తవాలు బయటపెట్టగానే బీజేపీ నాయకులు మమ్మల్నే విమర్శిస్తారు.

కల్వకుంట్ల కుటుంబం అంటే కట్టుబాట్లతో కూడిన కుటుంబం
తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ మధ్య భాగస్వామ్యం ఉంది. బీజేపీ, కాంగ్రెస్ మధ్య దోస్తీ బట్టబయలైంది. ప్రధానిని కలిసిన తర్వాత కేసీఆర్, కేటీఆర్‌పై కేసులు పెడుతామని రేవంత్ రెడ్డి అంటున్నారు. లేనిపోని విషయాలు తెచ్చి మాకు అంటగడుతున్నారు. కల్వకుంట్ల కుటుంబాన్ని, బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేయడమే తప్పా సీఎంకు ఇంకో ఆలోచన లేదు అని కవిత మండిపడ్డారు. కల్వకుంట్ల కుటుంబం అంటే కట్టుబాట్లతో కూడిన కుటుంబం. మేము ఎప్పుడూ ప్రొటొకాల్‌ను ఉల్లంఘించలేదు. కానీ రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరిస్తున్నారు.
తెలంగాణ ప్రజలకు రక్షణ కవచంగా కేసీఆర్
పార్టీ పరంగా ఇంచార్జి అయితే మాకు ఇబ్బంది లేదు.. కానీ అధికారిక సమావేశాల్లో ఎందుకు పాల్గొంటున్నారు. తిరుపతి రెడ్డికి కలెక్టర్ ఎందుకు ఎదురెళ్లి స్వాగతం చెబుతున్నారు. రాజ్యాంగేతర శక్తులను ముఖ్యమంత్రి ప్రోత్సహిస్తున్నట్లు కదా..? మా కుటుంబంలో అధికారికంగా, రాజ్యాంగబద్ధంగా ఎన్నికల్లో ఎన్నికయ్యి ప్రజాసేవ చేస్తున్నాం. ముఖ్యమంత్రి సోదరులు ఇష్టారీతినా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలకు రక్షణ కవచంగా ఉన్న కేసీఆర్ కుటుంబాన్ని, బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టాలన్నది సీఎం దురాలోచన. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కలిసి తెలంగాణకు రక్షణకవచంగా ఉన్న బీఆర్ఎస్ పై కుట్రలు చేస్తున్నయని కవిత అన్నారు.