‘మీ సేవ’లో ఆప్షన్ పునరుద్ధరణ
హైదరాబాద్: రాష్ట్రంలో మళ్లీ ప్రారంభమైన రేషన్‌కార్డు దరఖాస్తుల స్వీకరణ. మీసేవ కేంద్రాల్లో రేషన్ కార్డులకు దరఖాస్తులు చేసుకోవడంపై క్లారిటీ వచ్చేసింది. మీ-సేవ వెబ్‌సైట్‌లో రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ నిర్ణయం తీసుకుంది. మీసేవ అధికారులతో హైదరాబాద్‌లోని సివిల్ సప్లయిస్ భవన్‌లో సోమవారం సమావేశమై పౌరసరఫరాల శాఖ అధికారులు చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో తెలంగాణ వ్యాప్తంగా మీ సేవ వెబ్‌సైట్‌లో కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు స్వీకరణ సోమవారం సాయంత్రం ప్రారంభమైందని అధికారులు తెలిపారు. ఇందుకోసం మీసేవ వెబ్‌సైట్‌లో ‘మీ- దరఖాస్తుల స్వీకరణ’ ఆప్షన్ అందుబాటులోకి తెచ్చారు. దీని ద్వారా రేషన్ కార్డులు లేని వారు ఏ సమస్యా లేకుండా మీ సేవ వెబ్‌సైట్‌లో కొత్త కార్డులకు దరఖాస్తులు చేసుకునే వీలు కల్పించారు.

రాష్ట్రంలో మళ్లీ ప్రారంభమైన రేషన్‌కార్డు దరఖాస్తుల స్వీకరణ.తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రజావాణిలో రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నవారు, ప్రజాపాలనలో గానీ, కుల గణనలో గానీ పాల్గొని దరఖాస్తు చేసుకున్నవారు మరోసారి దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు. తెలంగాణ కేబినెట్ నిర్ణయం మేరకు ‘ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి వారికి రేషన్ కార్డులు మంజూరు చేస్తాం. కనుక మరోసారి దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. ఒక కుటుంబానికి సంబంధించిన వివరాలు పదే పదే చెక్ చేయడంతో అర్హులైన వారికి రేషన్ కార్డుల జారీలో మరింత జాప్యం తలెత్తే అవకాశం ఉందని’ సివిల్ సప్లైస్ అధికారులు తెలిపారు.
అయితే ఫిబ్రవరి 7న మీసేవ వెబ్ సైట్లో ఆప్షన్ కనిపించింది. ఫిబ్రవరి 8న ఉదయం నుంచి ఆప్షన్ కనిపించకపోవడంతో లబ్ధిదారులు ఆందోళనకు గురయ్యారు. ప్రభుత్వం ప్రకటన చేసిన తరువాత ఈ తలనొప్పి ఏంటనుకున్నారు. అయితే ప్రజల అవసరం, రేషన్ కార్డులకు ఉన్న డిమాండ్ ను దృష్టిలో ఉంచుకుని సోమవారం నాడు పౌరసరఫరాల శాఖ అధికారులు చర్చించి మీసేవ ద్వారా దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇదే విషయాన్ని మీసేవ కమిషనర్ కు స్పష్టం చేయడంతో మీసేవ వెబ్ సైట్లో సోమవారం సాయంత్రం నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది.