బెంగళూరు విమానాశ్రయంలో 14.2 కిలోల బంగారం స్మగ్లింగ్ కేసులో కన్నడ నటి రన్యా రావు అలియాస్ హర్హ్‌సవర్దిని మార్చి 3న అరెస్ట్ అయ్యారు. ఈ కేసులో మరో కీలక నిందితుడిగా తెలుగు నటుడు తరుణ్ రాజ్ కొండూరు అలియాస్ విరాట్ కొండూరు పేరు బయటకు వచ్చింది. దుబాయ్ నుండి బంగారం తరలించడానికి కొండూరు తన అమెరికా పాస్‌పోర్ట్‌ను ఉపయోగించినట్లు దర్యాప్తులో తేలింది.

రన్యా రావు దుబాయ్ కస్టమ్స్ వద్ద తప్పుడు ప్రకటన ఇచ్చినట్లు గుర్తించారు. తరుణ్ రాజ్ కొండూరు, రన్యా రావు గతంలో అనేక సార్లు దుబాయ్ వెళ్లినట్లు రికార్డులు వెల్లడించాయి. ఈ అక్రమ రవాణా వ్యవహారంలో అంతర్జాతీయ మాఫియాకు సంబంధాలు ఉన్నాయనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. డీఆర్ఐ (Directorate of Revenue Intelligence) అధికారులు రన్యా నివాసంలో సోదాలు చేసి రూ. 2.67 కోట్ల నగదు, రూ. 2.07 కోట్ల విలువైన ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. బంగారం అక్రమ రవాణా కోసం దుబాయ్‌లో ఉన్న స్మగ్లింగ్ ముఠాలు ప్రత్యేక వ్యూహాన్ని రూపొందించాయని అధికారులు గుర్తించారు.
స్మగ్లింగ్ మోసానికి ఉపయోగించిన పద్ధతులు
బంగారం తలుపులు, బ్యాగ్ లైనింగ్‌లో దాచడం, ప్రత్యేకమైన బ్యాండేజీలతో శరీరంపై అంటించుకోవడం లాంటి మార్గాలను ఉపయోగించారని రన్యా వాంగ్మూలంలో పేర్కొంది. దుబాయ్ నుండి 14.2 కిలోల బంగారాన్ని స్మగ్లింగ్ చేయడానికి కొండూరుకు చెందిన అమెరికా పాస్‌పోర్ట్ ఉపయోగించడం ప్రధాన అనుమానాస్పద అంశంగా మారింది. రన్యా రావు బెయిల్ కోసం ప్రత్యేక కోర్టును ఆశ్రయించినప్పటికీ, ఆమెపై ఉన్న తీవ్ర ఆరోపణల కారణంగా బెయిల్ మంజూరు చేయకుండా కోర్టు నిరాకరించింది. విచారణలో తన భర్త జతిన్ హుక్కేరి క్రెడిట్ కార్డు ద్వారా టిక్కెట్లు బుక్ చేసినట్లు వెల్లడైంది. మార్చి 3న రన్యా రావు బెంగళూరు నుండి దుబాయ్‌కు ఉదయం 4 గంటలకు విమానంలో బయలుదేరి వెళ్లింది. తిరిగి అదే రోజు బంగారంతో వచ్చి దొరికిపోయిందిఈ కేసు వెనుక దుబాయ్, స్విట్జర్లాండ్, భారత్ మధ్య అక్రమ బంగారు రవాణా నెట్‌వర్క్ ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. కస్టమ్స్ సుంకం ఎగవేసి భారీ మొత్తంలో బంగారాన్ని అక్రమంగా రవాణా చేసే అంతర్జాతీయ ముఠాలతో రన్యా రావు, కొండూరుకు సంబంధాలు ఉన్నాయా? అన్న కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. బంగారు స్మగ్లింగ్ ముఠా వ్యవహారం ఇంకెన్ని సినీ ప్రముఖులను కదిలిస్తుందో అనేది ఆసక్తికరంగా మారింది. రన్యా రావు, తరుణ్ రాజ్ కొండూరు కాకుండా మరెవరైనా ఈ ముఠాలో ఉన్నారా? అని అధికారులు వివరాలను సేకరిస్తున్నారు. ఈ కేసుపై ఇంకా గతంలో జరిగిన స్మగ్లింగ్ ఘటనలతో పోల్చి అధికారుల ప్రత్యేక దర్యాప్తు బృందం నివేదిక సిద్ధం చేస్తోంది. రానున్న రోజుల్లో మరింత సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.