ఊహించని మలుపులతో సాగిన ‘ప్రావింకూడు షాపు’
మలయాళ పరిశ్రమలో డిఫరెంట్ కాన్సెప్ట్‌లు, కొత్తదనం కలిగిన కథనాలతో చిత్రాలు తెరకెక్కించడంలో దర్శకులు ఎప్పుడూ ముందుంటారు. అలాంటి ప్రయోగమే శ్రీరాజ్ శ్రీనివాసన్ దర్శకత్వంలో రూపొందిన ‘ప్రావింకూడు షాపు’. ఈ సినిమా ఒక మారుమూల గ్రామంలో కల్లుషాపు చుట్టూ తిరిగే కథ ఆధారంగా, అనూహ్యమైన సంఘటనలతో సాగుతుంది. డార్క్ కామెడీ, క్రైమ్, థ్రిల్లర్ అనే మూడు ప్రధాన అంశాలతో చక్కటి మిశ్రమంగా నిలుస్తుంది. ముఖ్యంగా ఈ చిత్రంలో నటించిన సౌబిన్ షాహిర్, బాసిల్ జోసెఫ్, చంబన్ వినోద్ జోస్ తమ నటనతో సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. జనవరి 16న థియేటర్లలో విడుదలై సగటు వసూళ్లను సాధించిన ఈ చిత్రం ఇప్పుడు సోనీ లివ్ లో స్ట్రీమింగ్ కావడంతో మరింత మంది ప్రేక్షకులకు చేరువ కానుంది.
కథ – ఒక చిన్న షాపులో మొదలైన భారీ మిస్టరీ
కథలోకి వెళితే, అడవి ఒడిలో ఉన్న ఓ చిన్న గ్రామంలో బాబు అనే వ్యక్తి కల్లుశాపు నడుపుతూ ఉంటాడు. శారీరకంగా గట్టి శక్తిమంతుడైన బాబు, గ్రామస్థులకు భయానక వ్యక్తిగా పరిచయం. ఒకరోజు అతని షాపులో 11 మంది కస్టమర్లు కల్లుతాగుతూ వర్షం కారణంగా ఇంటికి వెళ్లలేక అక్కడే ఉండిపోతారు. అయితే తెల్లవారేసరికి షాపులో బాబు మృతదేహంగా ఉరివేసి కనిపిస్తాడు. ఇది ఆత్మహత్య కాదు హత్య అని భావించిన పోలీస్ ఆఫీసర్ సంతోష్ రంగంలోకి దిగుతాడు. అతని దర్యాప్తు ఓ మలుపు తిప్పిన విధంగా సాగుతుంది. మిస్టరీని ఛేదించేందుకు, ఆ 11 మందిలోని ఒక్కొక్కరి పై విచారణ మొదలుపెడతాడు. ఇందులో సునీ, కన్నా, మెరిండా వంటి పాత్రల పరిచయం కథను మరింత బలపరుస్తుంది. బాబుతో మెరిండాకి ఉన్న సంబంధం, కన్నా-సునీపై అనుమానాలు, ఆ రాత్రి అసలేం జరిగింది అనే అన్వేషణ కథను ఉత్కంఠభరితంగా తీసుకెళ్తుంది.
దర్శకత్వం – క్లాసిక్ టచ్‌తో నూతన కథనం
దర్శకుడు శ్రీరాజ్ శ్రీనివాసన్ ఒక పాత ఫార్ములా కథను, నూతనంగా చెప్పే ప్రయత్నం చేశారు. అయితే దాన్ని తన దృష్టిలో ఉన్న విజన్‌తో, మూడ్ మరియు మిస్టరీ ఫీలింగ్‌తో నింపారు. కథ ఒక మారుమూల గ్రామంలో, కానీ దాన్ని అద్భుతమైన విజువల్స్‌తో అత్యంత నూతనంగా చూపించారు. ప్రతి ఫ్రేమ్ లొకేషన్ బలంతో దృఢంగా నిలిచింది. సన్నివేశాల మధ్య మలుపులు ఆశ్చర్యపరిచేవిగా లేకపోయినా, కథన నిర్మాణం, సంభాషణలు నెమ్మదిగా అయినా ఆసక్తిగా ఉన్నాయి.
నటుల అభినయ ప్రదర్శన – నాణ్యతకు గుర్తింపే
ఈ సినిమాలోని నటీనటుల పాత్రలు పరిమితమైనా, ప్రదర్శన మాత్రం ప్రాణం పోసినట్లుగా సాగింది. ముఖ్యంగా బాసిల్ జోసెఫ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో సీరియస్ లుక్‌లో కనిపించగా , అతని పాత్రకి చక్కటి కామెడీ టచ్ ఇవ్వడం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సౌబిన్ షాహిర్ పాత్రలో భయాందోళన, అసమర్థత భావనలను చక్కగా చూపించాడు. చంబన్ వినోద్ జోస్ పాత్రలో మిస్టరీని మెదిలించేలా నటన సాగింది. ముఖ్యంగా ప్రతి పాత్రకు దర్శకత్వం ఇచ్చిన బలమైన మద్దతుతో నటీనటులు తమ పాత్రల్లో ఒదిగిపోయారు. సహాయ పాత్రధారులు కూడా తమ పరిధిలో బాగా నిలిచారు.
సాంకేతిక విశ్లేషణ – విజువల్స్, సంగీతమే అసలు స్పెషల్
షిజూ ఖాలిద్ ఫొటోగ్రఫీ ఈ సినిమాకి ప్రధాన శక్తిగా నిలుస్తుంది. చిన్న కథను భారీగా చూపించడంలో కెమెరా పనితనం కీలక పాత్ర పోషించింది. గ్రామీణ నేపథ్యం, వర్షపు సన్నివేశాలు, కల్లుశాపు ఇంటీరియర్‌లు.. సినిమా స్థాయిని కొత్తలెవెల్‌కి తీసుకెళ్లాయి. అలాగే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మరింత ఉత్కంఠను పంచుతుంది. కథలో కొత్తదనం లేకపోయినా, మ్యూజిక్ ప్రేక్షకుల్ని ఎంగేజ్ చేయడంలో కీలక పాత్ర పోషించింది. షఫిక్ మహ్మద్ అలీ ఎడిటింగ్ కూడా క్లిష్టమైన కట్‌లతో కథను సాఫీగా ముందుకు నడిపించింది.
కుటుంబంతో చూడదగిన క్రైమ్ థ్రిల్లర్
ఈ సినిమాలో అభ్యంతరకరమైన సన్నివేశాలు, అశ్లీల సంభాషణలు లేవు. దీంతోపాటు కథలో కామెడీ, క్రైమ్, థ్రిల్లర్ అన్ని సమంగా ఉండడం వలన, ఫ్యామిలీతో కలసి చూడదగిన చిత్రం. సీరియస్ థ్రిల్లర్ సినిమాలకు భిన్నంగా ఉండే లైట్ హార్ట్ టచ్ ఈ సినిమాను ప్రత్యేకంగా నిలిపింది. డ్రామా ఎక్కువగా లేకుండా, న్యాచురల్‌గా సినిమా నడిపించడంలో మేకర్స్ విజయం సాధించారు.
READ ALSO: Jack Movie : జాక్ మూవీ రివ్యూ