ఉత్తరప్రదేశ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాలో పాల్గొన్న సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వాన్ని ప్రశంసించారు. కుంభమేళా నిర్వహణపై వస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలపై స్పందించిన పవన్, ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. హిందూ ధర్మాన్ని, సనాతన సంప్రదాయాలను దూషించేలా ఉన్న వ్యాఖ్యలు తగవని, అలా మాట్లాడే నాయకులు ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నారని పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

పవన్ కళ్యాణ్ ప్రకటనలో, కుంభమేళా లాంటి మహా వైభవంతమైన కార్యక్రమాలను నిర్వహించడం ఏ ప్రభుత్వానికైనా పెద్ద సవాల్ అని పేర్కొన్నారు. కోట్లాది మంది భక్తులు హాజరయ్యే ఈ మహా కుంభమేళాలో కొన్ని ఘటనలు చోటుచేసుకున్నా, మొత్తం నిర్వహణను దోషంగా అనడం సరికాదన్నారు. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఈ వేడుకను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోందని, కొన్ని దురదృష్టకర సంఘటనలు జరిగినా, ప్రభుత్వం అద్భుతంగా పనిని చేపట్టిందని ఆయన కొనియాడారు.
ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనుభవజ్ఞులైన నాయకులకు తగదని పవన్ స్పష్టం చేశారు. మత విశ్వాసాలను కించపరిచే విధంగా మాట్లాడకుండా, ప్రతి మతాన్ని సమానంగా గౌరవించాల్సిన అవసరం ఉందని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. కుంభమేళా లాంటి ఆధ్యాత్మిక వేడుకల్ని మతపరమైన వివాదాలకు తాకట్టు పెట్టకుండా, ప్రజల మనోభావాలను గౌరవించాలని సూచించారు.