వక్ఫ్ బిల్లుపై పార్లమెంటులో జరిగిన సుదీర్ఘ చర్చ అనంతరం ఆమోదం లభించింది.దేశంలో ముస్లిం మైనారిటీల ఆస్తుల పరిరక్షణ కోసం రూపొందించిన వక్ఫ్ బిల్లుపై మొదటగా లోక్‌సభలో చర్చ ప్రారంభమై, ఆ తర్వాత రాజ్యసభ కు వెళ్ళింది. అధికార పక్షం,విపక్షాల మధ్య వాగ్వాదాలు, విమర్శలు, ప్రతివిమర్శల మధ్య ఈ చర్చలు కొనసాగాయి. ప్రత్యేకంగా రాజ్యసభలో ఈ చర్చ అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా కొనసాగిన విషయం గమనార్హం.ఇలా అనేక బిల్లులపై సుదీర్ఘ చర్చలు జరిపిన చరిత్ర మన పార్లమెంటుకు ఉంది. ఓ బిల్లుపై గతంలో 20గంటల పాటు ఏకధాటిగా లోక్‌సభలో చర్చ జరిగినట్లు మేధోసంస్థ పీఆర్‌ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ వెల్లడించింది.
14 గంటలపాటు చర్చ
వక్ఫ్ బిల్లుపై లోక్‌సభలో 14 గంటలపాటు చర్చ జరగ్గా, రాజ్యసభలో చర్చ ప్రారంభమైన మరుసటి రోజు ఉదయం 4.02 గంటల వరకు కొనసాగింది. మొత్తంగా పెద్దల సభలో 17గంటల పాటు సుదీర్ఘ చర్చ జరిగిందని, రాజ్యసభ చరిత్రలోనే ఇదో అరుదైన విషయమని ఛైర్మన్ జగ్‌దీప్ ధన్‌ఖడ్ పేర్కొన్నారు. అయితే, 1981లో రాజ్యసభలో ఎసెన్షియల్ సర్వీసెస్ మెయింటెనెన్స్ బిల్లుపైనా ఉదయం 4.43 గంటల వరకు చర్చ కొనసాగినట్లు నివేదికలు చెబుతున్నాయి.లోక్‌సభలో స్టేట్ ఆఫ్ అవర్ డెమోక్రసీపై గతంలో 20.08గంటల పాటు సాగిన చర్చే ఇప్పటివరకు సుదీర్ఘమైనది. ఆ తర్వాత 1993లో రైల్వే బడ్జెట్‌పై 18.35గంటల చర్చ జరిగింది. 1998లో రైల్వే బడ్జెట్‌పైనా 18.04 గంటలు, మైనార్టీల భద్రతకు సంబంధించి బిల్లుపై 17.25గంటలు, 1981లో ఎసెన్షియల్ సర్వీసెస్ మెయింటెనెన్స్ బిల్లుపై రాజ్యసభలో 16.58 గంటలపాటు సుదీర్ఘ చర్చ జరిగింది.

వక్ఫ్ సవరణ బిల్లును ముస్లింలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు
వక్ఫ్ చట్టాన్ని,ముస్లిం సమాజంతోపాటు,రాజకీయ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ మార్పులు వక్ఫ్ సంస్థల స్వయంప్రతిపత్తిని దెబ్బతీస్తాయని,విమర్శకులు సైతం వాదిస్తున్నారు. అయితే, వక్ఫ్ సవరణ బిల్లులో ముస్లింలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.వక్ఫ్ బోర్డులు తమ ఆస్తులకు సంబంధించిన ఆస్తి పత్రాలను సమర్పించాలని బిల్లు ఆదేశిస్తుంది. దీని ప్రకారం వక్ఫ్ ఆస్తులకు పూర్తి డాక్యుమెంటనేషన్ తప్పనిసరి. కానీ వారసత్వంగా ఉన్న ముస్లింల ఆస్తులకి పాత రికార్డులు ఎక్కడ ఉంటాయనే ప్రశ్న తలెత్తుతోంది. దీంతో అధికారులు కావాలంటే ఏదైనా వక్ఫ్ ఆస్తిని ప్రభుత్వ భూమిగా మార్చేయగలరని ముస్లింలు భయపడుతున్నారు.నూతన చట్టం వల్ల వక్ఫ్ భూముల సర్వే అధికారాలు కలెక్టర్ల చేతిలోకి వెళ్లిపోవడంతో భూమి ఆక్రమణలకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ముస్లిం నేతలు ఆరోపిస్తున్నారు. బినామీల ద్వారా వక్ఫ్ భూములను కొట్టేసేందుకు ఇది అవకాశం కల్పిస్తుందనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.ముస్లిం సమాజంలో మత, ధార్మిక ప్రయోజనాల కోసం ఉద్దేశించిన వక్ఫ్ ఆస్తుల విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవడం మత స్వేచ్ఛకు అడ్డు తగలడమేనని ఇది మైనార్టీల హక్కులను కాలరాస్తుందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.