Surinder Choudhary : పాకిస్థాన్ ఇప్పటికైనా ఉగ్రవాదాన్ని వదులుకోవాలని జమ్మూకశ్మీర్ డిప్యూటీ సీఎం సురీందర్ చౌధరీ హితవు పలికారు. మూడు దశాబ్దాలుగా అక్కడ ఉన్న ఉగ్రవాదం అంతమై మంచి పరిస్థితులు రావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఉగ్రచర్యలకు భారత్ లొంగదని పాకిస్థాన్ గుర్తుపెట్టుకోవాలి. ఆ దేశం ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం వల్ల తనకు తానుగా ప్రమాదాన్ని తెచ్చిపెట్టుకుంటోంది అని సురీందర్ చౌధరీ అన్నారు. సరిహద్దు అవతల పన్నుతున్న కుట్రల వల్ల తమ పిల్లలు ప్రాణాలు కోల్పోతున్నారని సురీందర్ చౌధరీ ఆవేదన వ్యక్తం చేశారు. హింసతో ఏమీ సాధించలేమనే విషయాన్నిపాకిస్థాన్ తెలుసుకొవాలని అన్నారు.

గత 30ఏళ్లుగా మనపై దాడులు
కేంద్ర, ప్రభుత్వం కానీ, జమ్ముకశ్మీర్ ప్రభుత్వం కానీ మన పిల్లల బలిదానాలను ఎప్పటికీ కోరుకోవు. సరిహద్దు అవతల పన్నుతున్న కుట్రల కారణంగానే వారు ప్రాణాలు కోల్పోతున్నారు. గత 30ఏళ్లుగా మనపై దాడులు చేస్తున్నా వారు ఏమీ సాధించలేదన్నారు. కథువా జిల్లాలోని సఫియాన్ అడవిలో ఉగ్రవాదులతో రెండు రోజుల పాటు జరిగిన ఎన్‌కౌంటర్‌లో పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రసంస్థ జైష్-ఎ-మొహమ్మద్ (జెఎం)తో సంబంధం ఉన్న ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చాయి. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు పోలీసులు ప్రాణాలు కోల్పోగా, ఒక డీఎస్పీతో పాటు నలుగురు సైనికులు గాయపడ్డారు. ఈ ఆపరేషన్ ఇప్పటికీ కొనసాగుతోంది. మృతిచెందిన పోలీసులకు నివాళులర్పించిన అనంతరం సురీందర్ మాట్లాడుతూ..ఈ వ్యాఖ్యలు చేశారు.