Pakistan: పాకిస్థాన్ 30 లక్షల మంది అఫ్గానీయులను తమ దేశం నుంచి బహిష్కరించేందుకు ప్రణాళికలు వేస్తున్నట్లు తెలుస్తోంది. అఫ్గానిస్థాన్ నుంచి వచ్చి పాక్‌లో ఉంటున్న వారిపై ఇస్లామాబాద్ కీలక నిర్ణయం తీసుకుంది. అఫ్గాన్ నుంచి శరణార్థులుగా వచ్చినవారు తమ దేశం విడిచి వెళ్లడానికి ఇచ్చిన గడువు నేటితో ముగియడంతో ఈ చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. 30 లక్షల మంది అఫ్గానీయులను తమ దేశం నుంచి బహిష్కరించేందుకు ప్రణాళికలు వేస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

అక్టోబర్ నుంచి పాక్ ఈ బహిష్కరణ అస్త్రాన్ని ప్రయోగిస్తోంది
కాగా, ఏప్రిల్ 1 నుంచి దేశంలో అక్రమంగా నివసిస్తున్న వారిని గుర్తించి బహిష్కరించాల్సి ఉంది. అయితే కొన్ని కారణాల రీత్యా బహిష్కరణలను ఈ నెల 10వ తేదీకి వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తమ దేశంలో అక్రమంగా నివసిస్తున్న అఫ్గానిస్థాన్ వాసులను , ఇతర విదేశీయులను తిరిగి పంపడానికి 2023 అక్టోబర్ నుంచి పాక్ ఈ బహిష్కరణ అస్త్రాన్ని ప్రయోగిస్తోంది. ఆ దేశ సిటిజన్ కార్డు ఉన్నవారు స్వచ్ఛందంగా ఇస్లామాబాద్‌ను వదిలి వెళ్లాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. బహిష్కరణకు గురైన వారు తిరిగి పాకిస్థాన్‌లోకి రాకుండా చర్యలు తీసుకోవాలని అక్కడి ప్రభుత్వం అధికారులను ఆదేశించింది.
ప్రస్తుతం పాక్‌లో 3 మిలియన్ల మంది అఫ్గానిస్థాన్‌వాసులు
గత 18 నెలల్లో సుమారు 8వేలకు పైగా అఫ్గానిస్థాన్‌కు చెందిన వలసదారులు పాక్‌ను వీడినట్లు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ప్రస్తుతం ఆ దేశంలో 3 మిలియన్ల మంది అఫ్గానిస్థాన్‌వాసులు ఆశ్రయం పొందుతున్నారని.. ఎటువంటి పత్రాలు లేకుండా చట్టవిరుద్ధంగా మరో మిలియన్ మంది ఉంటున్నారని పేర్కొన్నాయి. తమ పౌరులను బహిష్కరించడానికి పాక్ చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో అఫ్గానిస్థాన్ శరణార్థుల మంత్రిత్వ శాఖ ప్రతినిధి అబ్దుల్ ముతాలిబ్ కీలక ప్రకటన చేశారు.