Hyderabad Metro: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవలే వివిధ శాఖల్లో రీ-అపాయింట్మెంట్, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ విధానాల్లో కొనసాగుతున్న ఉద్యోగులను ఉద్వాసన పలికిన ప్రభుత్వం.. మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించి కీలకమైన నిర్ణయాన్ని వెల్లడించింది. హైదరాబాద్ మెట్రో రైలు లిమిటెడ్ (HMRL), హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రో లిమిటెడ్ (HAML) ఎండీగా ఎన్వీఎస్ రెడ్డిని మళ్లీ నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఎం. దానకిశోర్ నుంచి అధికారిక ఉత్తర్వులు
ఈ మేరకు ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం. దానకిశోర్ నుంచి అధికారిక ఉత్తర్వులు విడుదలయ్యాయి. ఇప్పటికే హైదరాబాద్ మెట్రో రెండో దశకు సంబంధించిన ప్రాజెక్టు ప్రతిపాదనలు కీలక దశలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రారంభం నుంచే మెట్రో ప్రాజెక్టుకు నడిపిన ఎన్వీఎస్ రెడ్డి అనుభవం ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే ఆయనను మరో ఏడాది పాటు హెచ్ఎంఆర్ఎల్, హెచ్ఏఎంఎల్ ఎండీగా కొనసాగించేందుకు నిర్ణయం తీసుకుంది.
ఈ ప్రాజెక్టు మొత్తం రెండు భాగాలుగా
ప్రస్తుతం మెట్రో సెకండ్ ఫేజ్ ప్రాజెక్టు భాగంగా ఓల్డ్ సిటీ, ఎయిర్‌పోర్ట్, ఫోర్త్ సిటీ, నార్త్ సిటీ లాంటి ప్రాంతాలకు మెట్రో సేవలు విస్తరించేందుకు ప్రభుత్వం చొరవ తీసుకుంటోంది. ఈ ప్రాజెక్టు మొత్తం రెండు భాగాలుగా – పార్ట్-ఏ(5 కారిడార్లు), పార్ట్-బీ(3 కారిడార్లు)గా విభజించగా, పార్ట్-ఏకి చెందిన డీపీఆర్‌ను ఇప్పటికే కేంద్రానికి పంపారు. కేంద్ర అనుమతుల కోసం ఎదురుచూస్తోంది. అనుమతి లభించిన వెంటనే పనులను వేగంగా ప్రారంభించాలనే ఉద్దేశంతోనే ఎన్వీఎస్ రెడ్డి సేవలు కొనసాగించనున్నారు. ఇక ఇటీవలే ప్రభుత్వం మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖలో 177 మంది, పంచాయతీ రాజ్ శాఖలో 47 మందిని తొలగించింది.
Read Also : నటుడు మంచు మనోజ్ కారు చోరీ..పోలీసులకు ఫిర్యాదు