ఒక అమ్మాయి “ఛాతీ మీద చేయివేయడం”, ఆమె లోదుస్తుల బొందులను విప్పి వివస్త్రను చేయడానికి ప్రయత్నించడం అత్యాచార ప్రయత్నంగా పరిగణించలేమంటూ ఇటీవల అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు పక్కనబెట్టింది. అలహాబాద్ హైకోర్టు గత వారం ఈ నేరాన్ని ‘‘ తీవ్రమైన లైంగిక దాడి”గా మాత్రమే గుర్తించి, దీనికి తక్కువ శిక్ష విధించవచ్చని తీర్పు ఇచ్చింది. హైకోర్టు ఉత్తర్వులోని కొన్ని వ్యాఖ్యలు చూస్తే వాటిని రాసిన న్యాయమూర్తికి సున్నితత్వం అంటే ఏంటో తెలియనట్లుగా ఉందనిపిస్తోందని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అన్నారు. అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై దేశంలో ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. బుధవారం, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టీన్లతో కూడిన ఇద్దరు న్యాయమూర్తుల సుప్రీంకోర్టు ధర్మాసనం…అలహాబాద్ హైకోర్టు మార్చి 17న ఇచ్చిన తీర్పు షాక్‌కి గురిచేసేలా ఉందని అని వ్యాఖ్యానించింది. ఈ కేసు తీర్పును నాలుగు నెలలపాటు రిజర్వ్ చేసిన తర్వాత మార్చి 17 వెలువరించింది అలహాబాద్ హైకోర్టు.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు
ఈ విషయంపై ఉత్తరప్రదేశ్ రాష్ట్రప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు కూడా పంపించింది. ఇద్దరు నిందితులు తన 11 ఏళ్ల తన కుమార్తెను మోటార్ సైకిల్‌పై ఇంటివద్ద దింపుతామని చెప్పారని, ఈ కేసు విచారణ సందర్భంగా బాలిక తల్లి చెప్పారు. తమ గ్రామానికి చెందిన వారు, తెలిసిన వ్యక్తులు కావడంతో వారితో తన కుమార్తెను పంపించానని చెప్పారు. “గ్రామానికి వెళ్లే దారిలో మోటార్ సైకిల్‌ను ఆపి బాలిక ఛాతి భాగాన్ని పట్టుకోవడం మొదలుపెట్టారు. మరో వ్యక్తి బాలికను ఒక కల్వర్టు వద్దకు తీసుకెళ్లి ఆమె పైజామా బొందును తీశాడు.” అని హైకోర్టు పేర్కొంది.
దేశంలో ఆగ్రహానికి దారితీసిన వివాదాస్పద తీర్పు
బాలిక సాయం కోసం కేకలు వేయడంతో, కొంతమంది గ్రామస్తులు ఆమెను రక్షించారు. దుండగులు అక్కడినుంచి పారిపోయారు. అయితే, తమపై వచ్చిన ఆరోపణలను నిందితులు ఖండించారు.‘అత్యాచార యత్నం’ ‘అత్యాచారం చేయడానికి సిద్ధం కావడం’ రెండూ భిన్నమైనవన్న వాదన ఆధారంగా హైకోర్టు తీర్పు వెలువడిందని, ఈ తీర్పును ఉటంకిస్తూ లీగల్ వెబ్‌సైట్ లైవ్ లా పేర్కొంది. “అత్యాచారానికి సిద్ధం కావడానికిమించి ఏదైనా జరిగిందా అన్నది విచారణలో నిరూపించాలి. అత్యాచారం చేయడానికి సిద్ధం కావడం, అత్యాచారానికి ప్రయత్నించడం మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది” అని హైకోర్టు ఆర్డర్ పేర్కొంది. ఈ వివాదాస్పద తీర్పు దేశంలో ఆగ్రహానికి దారితీసింది. ఇది దారుణమైన తీర్పు అని చాలామంది అన్నారు.
చట్టపరంగా ఇది అత్యాచార ప్రయత్నం కిందకే వస్తుంది
సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ ఒక టీవీ చానల్‌తో మాట్లాడుతూ, ఆ చిన్నారికి జరిగింది అత్యాచారానికి సిద్ధమవడానికి మించిందేనని, చట్టపరంగా ఇది అత్యాచార ప్రయత్నం కిందికే వస్తుందని ఆమె అన్నారు. ” అత్యాచారం చెయ్యాలన్న ఉద్దేశ్యాన్ని మీరు ఎలా నిరూపిస్తారు? అత్యాచారం జరగడానికి ముందు జరిగే చర్యలను బట్టే అది నిరూపితమవుతుంది.” అని ఆమె అన్నారు. బాలికను ఏకాంత ప్రదేశానికి లాక్కెళ్లడం అంటేనే అత్యాచారం చెయ్యాలన్న ఉద్దేశంతో అని అర్ధం చేసుకోవాలని ఆమె అన్నారు. “నాగరిక సమాజంలో హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పుకు స్థానం లేదు. అది సమాజంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.” అని కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణా దేవి న్యూస్ ఏజెన్సీ పీటీఐతో అన్నారు.