IRCTC Divya Dakshin Yatra: దక్షిణాది రాష్ట్రాల్లోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రాలను సందర్శించాలనుకునే భక్తుల కోసం ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) సరికొత్త టూర్ ప్యాకేజీని ప్రకటించింది. ‘దివ్య దక్షిణ యాత్ర’ పేరుతో భారత్ గౌరవ్ ఎక్స్‌ప్రెస్ ద్వారా ఈ ప్రత్యేక యాత్రను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ టూర్ ద్వారా తమిళనాడులోని అరుణాచలం, రామేశ్వరం, కన్యాకుమారి వంటి ఆధ్యాత్మిక క్షేత్రాలను సందర్శించవచ్చు. మొత్తం 8 రాత్రులు/9 పగళ్లు సాగే ఈ యాత్ర అక్టోబర్ 6వ తేదీన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభమవుతుంది. ఈ రైలులో మొత్తం 705 సీట్లు అందుబాటులో ఉండగా, అందులో స్లీపర్-237, 3ఏసీ-416, 2ఏసీ-52 సీట్లు కేటాయించారు.

IRCTC Divya Dakshin Yatra: రైలు నిలిచే ప్రధాన స్టేషన్లు & యాత్రా మార్గం
సికింద్రాబాద్ నుంచి బయలుదేరే ఈ భారత్ గౌరవ్ ఎక్స్‌ప్రెస్‌కు తెలుగు రాష్ట్రాల్లోని అనేక ప్రధాన స్టేషన్లలో బోర్డింగ్, డీబోర్డింగ్ సౌకర్యం కల్పించారు. చర్లపల్లి, జనగామ, ఖాజీపేట్, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, మధిర, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట స్టేషన్లలో ప్రయాణికులు ఎక్కడానికి లేదా దిగడానికి అవకాశం ఉంటుంది.
సందర్శించే ఆధ్యాత్మిక క్షేత్రాల జాబితా
- తిరువణ్ణామలై: యాత్ర ప్రారంభంలో అరుణాచలేశ్వరుడి దర్శనం.
- చిదంబరం: ప్రసిద్ధ శ్రీ నటరాజస్వామివారి ఆలయ సందర్శన, ప్రత్యేక పూజలు.
- తిరుచిరాపల్లి (త్రిచీ): శ్రీరంగనాథస్వామి ఆలయ దర్శనం.
- తంజావూరు: చారిత్రాత్మక బృహదీశ్వర ఆలయ సందర్శన.
- రామేశ్వరం: శ్రీ రామనాథస్వామి దర్శనం.
- మధురై: ప్రఖ్యాత మీనాక్షి అమ్మవారి దర్శనం.
- కన్యాకుమారి: రాక్ మెమోరియల్, కుమారి అమ్మన్ ఆలయ దర్శనంతో యాత్ర ముగిసి, తిరిగి రైలు సికింద్రాబాద్ చేరుకుంటుంది.
ఈ ప్యాకేజీని ప్రయాణికుల సౌకర్యార్థం మూడు కేటగిరీలుగా విభజించారు. ప్రయాణ తరగతిని బట్టి ఛార్జీలు నిర్ణయించారు. ఎకానమీ (స్లీపర్ క్లాస్) కేటగిరీలో పెద్దలకు ఒక్కరికి ₹15,800, 5 నుంచి 11 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలకు ₹14,800గా నిర్ణయించారు. స్టాండర్డ్ (3AC) కేటగిరీలో పెద్దలకు ₹23,200, పిల్లలకు ₹22,000 ఛార్జీగా ఉంటుంది. ఇక కంఫర్ట్ (2AC) కేటగిరీలో పెద్దలకు ₹29,600, పిల్లలకు ₹28,100 చెల్లించాల్సి ఉంటుంది. దక్షిణ భారతదేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను ఒక్కసారిగా దర్శించుకోవాలనుకునే భక్తులకు ఈ భారత్ గౌరవ్ ఎక్స్‌ప్రెస్ యాత్ర ఒక ఉత్తమమైన అవకాశంగా నిలుస్తుంది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :