Constable Posts : తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న ఉద్యోగ సమస్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (KTR) గళమెత్తారు. రాష్ట్రంలో తక్షణమే 20,000 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన ఒక బహిరంగ లేఖ రాశారు. పోలీసు శాఖలో దాదాపు 17,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయనే విషయాన్ని స్వయంగా ప్రభుత్వమే అంగీకరించిందని, అయినప్పటికీ ఇప్పటివరకు వాటి భర్తీకి ఎందుకు చర్యలు చేపట్టడం లేదని కేటీఆర్ నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీపై కాలయాపన చేస్తోందని, దీనివల్ల వేలాది మంది అభ్యర్థులు వయోపరిమితి దాటిపోయి నష్టపోయే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
Read Also : గ్రామాల్లో నాలుగు రకాల చెత్త సేకరణ తప్పనిసరి.. సీఈవో ఎల్లయ్య

మా హయాంలో 1.60 లక్షల ఉద్యోగాలిచ్చాం.. కాంగ్రెస్ హామీలు నెరవేర్చాల్సిందే!
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన నియామకాలను ఈ సందర్భంగా కేటీఆర్ గుర్తు చేశారు. తాము ఎలాంటి ముందస్తు ఎన్నికల హామీలు ఇవ్వకపోయినప్పటికీ, యువత సంక్షేమాన్ని కాంక్షించి రికార్డు స్థాయిలో 47,000 పోలీసు ఉద్యోగాలను విజయవంతంగా భర్తీ చేశామని స్పష్టం చేశారు. తమ పదేళ్ల పాలనలో మొత్తం 2,32,000 ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేసి, అందులో 1,60,000కు పైగా పోస్టులను పూర్తిస్థాయిలో భర్తీ చేసిన ట్రాక్ రికార్డ్ తమకు ఉందన్నారు. ఎన్నికల సమయంలో అధికారంలోకి వస్తే ఏటా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని నిరుద్యోగులకు కాంగ్రెస్ పార్టీ పెద్దపెద్ద హామీలు ఇచ్చిందని, వాటిని అమలు చేయకపోవడంతో ప్రస్తుతం యువత ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉందని కేటీఆర్ హెచ్చరించారు. నిరుద్యోగుల ఆగ్రహానికి గురికాకముందే ఇచ్చిన మాట ప్రకారం తక్షణమే మెగా నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :