Kunal Kamra: స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండేని లక్ష్యంగా చేసుకుని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆయన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. దీంతో కమ్రాపై పోలీసులు ముంబై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి నోటీసులు కూడా జారీ చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా అతడు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. అరెస్ట్ నుంచి తనకు రక్షణ కల్పించాలంటూ ముందస్తు బెయిల్ కోరుతూ పిటిషన్ వేశాడు. కమ్రా తమిళనాడు వాసి కావడంతో ఈ కేసులో అతడు మద్రాసు హైకోర్టుకు వెళ్లినట్లు తెలుస్తోంది.

షిండేను ఉద్దేశించి దేశద్రోహి అంటూ అభివర్ణించాడు
ముంబైలోని ఖార్ ప్రాంతంలోని ది హాబిటాట్ కామెడీ క్లబ్బులో జరిగిన కార్యక్రమంలో కునాల్ కమ్రా దిల్‌తో పాగల్ హై పాటను రాజకీయ పేరడీ చేసి పాడారు. ఇందులో షిండే ను ఉద్దేశించి ద్వంద్వ అర్థం వచ్చేలా పాడారు. ఈ సందర్భంగా షిండేను ఉద్దేశించి దేశద్రోహి అంటూ అభివర్ణించాడు. ఇది షిండే అభిమానులకు కోపం తెప్పించింది. కునాల్‌కు వ్యతిరేకంగా క్లబ్‌పై శివసేన కార్యకర్తలు దాడి చేసి, ధ్వంసం చేశారు. తక్షణమే కునాల్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కునాల్ క్షమాపణ చెప్పాలని సీఎం ఫడ్నవీస్ సైతం డిమాండ్ చేశారు. అయితే, తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పనని కునాల్ కమ్రా ఇప్పటికే స్పష్టం చేశారు. షిండేపై వ్యాఖ్యల నేపథ్యంలో కమ్రాపై ముంబైలో రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి.