ఒక గురువు… ఇద్దరు యువ శిష్యులు ఆయన ఎదుట కూర్చున్నారు. గురువు పాఠం చెప్తున్నారు. శిష్యులకు చాలా కాలంగా ఒక ఆశ. అదేమిటంటే, ఓ ముఖ్యమైన మంత్రాన్ని తమ గురువుగారి వద్ద నేర్చుకోవాలన్నదే ఆ ఆశ. అదేం మంత్రం అంటే… మరణించిన వారిని బతికించే శక్తిమంతమైన పవిత్ర మంత్రం.

“గురువుగారూ, మరణించిన వారికి మళ్ళీ ఊపిరి పోసే మంత్రాన్ని మాకు ఉపదేశించండి. దయచేసి కరుణించండి” అన్నారు శిష్యులు ఒక్క మాటగా.
“అది ప్రమాదకరమైనది… అయినా ఆ మంత్రం మీకెందుకు?” అని అడిగారు గురువుగారు.
“మా నమ్మకాన్ని దృఢ పరుచుకోవడానికి అడుగుతున్నాం గురువుగారూ!” అని చెప్పారు శిష్యులు. అయితే గురువుగారు “పరిపక్వత లేని జ్ఞానం ప్రమాదకరం” అని గురువుగారన్నారు. అది శిష్యులకు అర్థం కాలేదు.”పరిపక్వత లేని జ్ఞానం ప్రమాదకరమా? అదెలా? అని అడిగారు శిష్యులు. మీరు చెప్పిన మాట అర్థం కాలేదు. కాస్తంత విడమరిచి చెప్తారా?” అని ప్రశ్నించారు. గురువుగారు “ఆ మంత్రాన్ని ఎప్పుడు ప్రయోగించాలో అనే పరిపక్వత తెలిసేంతవరకూ అది తెలుసుకోకుండా ఉండటమే మంచిది” అని గురువుగారు చెప్పారు.

కానీ శిష్యులు తమ పట్టు వదలలేదు. “తమకు చెప్పి తీరాల్సిందే” అన్నారు. “సరే! చెప్తాను అని అన్నారు గురువుగారు. గురువుగారు వారిద్దరికీ రహస్యంగా చెప్పారు మంత్రాన్ని.

వారికి ఉపదేశించడమే కాకుండా హెచ్చరిక కూడా చేశారు. “ఈ మంత్రాన్ని బాగా పరిశోధించి చూసిన తర్వాతే ఉచ్చరించాలి చెప్పారు. అంతేకప్ప తొందరపడి చెప్పకూడదు అని అన్నారు. మంత్రాన్ని చెప్పాలనుకున్నప్పుడు ఒకటికి పది సార్లు ఆలోచించాలన్నారు.”శిష్యులు “అలాగే” అని అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఆనందంగా.

ఒకరోజు ఆ శిష్యులిద్దరూ నడుచుకుంటూ పోతున్నారు. ఒకచోట వారికి ఎముకలు కుప్పగా పడి ఉండటం కనిపించింది. వెంటనే వారు ముందు-వెనుకలు ఆలోచించకుండా, ధ్యానమూ చేయకుండా మంత్రశక్తిని పరీక్షించాలనుకున్నారు.

గురువుగారు చెప్పిన మంత్రాన్ని ఉచ్చరించారు మరుక్షణం… ఆ ఎముకలన్నీ కలిసి రెండు తోడేళ్లుగా మారాయి. తోడేళ్లు వారిద్దరినీ వెంటపడి తరిమాయి. శిష్యులు కుయ్యో మొర్రో అంటూ కిందా మీదా పడి పరిగెత్తారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరిగెత్తుతున్నారు.

పరిపక్వత లేని జ్ఞానం
అయినా తోడేళ్లు వారిని విడవలేదు వారి వెంట పడ్డాయి ఇద్దరినీ పట్టుకుని కరిచాయి అప్పుడు ఆ శిష్యులకు గురువుగారు చేసిన హెచ్చరిక అర్థమైంది. పరిపక్వత లేని జ్ఞానం ప్రమాదకరం అని గ్రహించారు.

మొత్తం మీద ఎలాగోలా తప్పించుకుని గాయాలతో బతుకు జీవుడా! అని ఆశ్రమానికి చేరుకుని జరిగినదంతా గురువుగారికి చెప్పారు.ఈ సంఘటన నుంచి మనం తెలుసుకోవలసింది ఏమిటంటే— మనం జ్ఞానాన్ని పెంపొందించుకున్నంత మాత్రాన సరిపోదు.

అప్పుడే జీవితం హాయిగా ఉంటుంది
తెలిసిన విషయాన్ని ఎప్పుడు ఎలా ఉపయోగించాలో తెలుసుండాలి. అప్పుడే జీవితం హాయిగా ఉంటుంది. లేకుంటే అధోగతే. ఈ కాలంలో కొందరు చిన్న పిల్లలకే బోలెడన్ని తెలివితేటలు ఉండటం చూస్తూ ఉంటాం. వారి మాటలు కూడా సామాన్యమైనవి కావు. వారితో వాదించలేం.ఓ కుర్రాడికి స్కూల్లో ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చారు. అది తీసుకుని త్వరత్వరగా ఇంటికి వెళ్తున్నాడు. కొంత దూరం వెళ్లేసరికి ఎదురుగుండా ఒక వ్యక్తి వస్తున్నారు. “బాబు, ఎందుకంత వేగంగా పోతున్నావు?” అని అడిగారాయన కుర్రాడిని. “మా అమ్మ దగ్గర దెబ్బలు తినాలి… అందుకే వేగంగా పోతున్నాను” అని జవాబిచ్చాడు కుర్రాడు.
“అదేంటీ? దెబ్బలు తినడానికి అంత వేగంగా వెళ్లాలా?” అని ఆ వ్యక్తి అడిగాడు ఆశ్చర్యంగా.
“మీరనుకున్నట్లు కాదండీ! నేను వెళ్లేలోపు మా నాన్నగారు ఇంటికి వచ్చేసారంటే ఆయన దగ్గర దెబ్బలు తినాలి. ఆయన కొట్టే దెబ్బలు తినడం కన్నా అమ్మ దగ్గర కొట్టించుకోవడం మేలు. ఎంతైనా అమ్మ అమ్మే కదండీ. బలంగా కొట్టదండీ. అంతేకాదు, తర్వాత నాన్నతో తన్నులు తినకుండా అడ్డుపడుతుంది. అందుకే నేను వేగంగా ఇంటికి పోతున్నాను” అన్నాడు కుర్రాడు.
– యామిజాల జగదీశ్
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: