మాకు ఉపన్యాసాలు ఇచ్చే స్థాయిలో పాక్ లేదు..
జెనీవా : దాయాది దేశం మరోసారి అంతర్జాతీయ వేదికలపై భారత్‌పై తన అక్కసు వెల్లగక్కింది. తాజాగా జమ్మూకశ్మీర్‌లో ప్రజాస్వామ్యం అణచివేతకు గురవుతోందని, మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలిలో దాయాది దేశం ఆరోపించింది. ఈ ఆరోపణలను భారత్ ఖండించింది. అంతేకాక.. మాకు ఉపన్యాసాలు ఇచ్చే స్థాయిలో ఆ దేశం లేదని స్పష్టం చేసింది. జెనీవాలో జరిగిన ఈ సమావేశంలో జమ్మూకశ్మీర్‌ను ఉద్దేశించి పాక్ న్యాయ, మానవ హక్కుల మంత్రి అజం నజీర్ తరార్ వ్యాఖ్యలు చేశారు. దీనిపై భారత రాయబారి క్షితిజ్ త్యాగి దీటుగా స్పందించారు.

ఆ దేశ వాక్‌చాతుర్యంలోనే కపటత్వం కన్పిస్తోంది
కేంద్రపాలిత ప్రాంతాలైన జమ్మూకశ్మీర్, లద్ధాఖ్‌లు ఎప్పుడూ భారత్‌లో అంతర్భాగమే. దశాబ్దాల తరబడి పాకిస్థాన్ ఉగ్రవాదం కారణంగా దెబ్బతిన్న ఆ ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు తెచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది. మానవ హక్కుల ఉల్లంఘన, మైనారిటీలను హింసించడంతో సహా ప్రజాస్వామ్య విలువలను పాటించని దాయాది దేశం భారత్‌కు ఉపన్యాసాలు ఇచ్చే స్థాయిలో లేదు. ఆ దేశ వాక్‌చాతుర్యంలోనే కపటత్వం కన్పిస్తోంది. ఐరాస జాబితాలోని పలు ఉగ్రవాద సంస్థలకు ఆ దేశం ఆశ్రయం కల్పిస్తుంది.
తమ దేశంలోని ప్రజలకు సుపరిపాలనను అందించడంపై దృష్టి
ప్రజాస్వామ్య పురోగతి, ప్రజలకు గౌరవం కల్పించడం వంటి వాటిపై భారత్ దృష్టిసారిస్తుంది. ఆ దేశం మాపై ఆరోపణలు చేయడం మానేసి.. తమ దేశంలోని ప్రజలకు సుపరిపాలనను అందించడంపై దృష్టిపెట్టాలి అని త్యాగి పేర్కొన్నారు. ఇక, ఇటీవల చైనా అధ్యక్షతన జరిగిన భద్రతామండలి సమావేశంలోనూ పాకిస్థాన్ విదేశాంగ మంత్రి మహమ్మద్ ఇషక్ దార్ జమ్మూకశ్మీర్ అంశాన్ని లేవనెత్తారు. దీనికి సైతం భారత్ ఘాటుగా స్పందించింది. జైషే మహమ్మద్ వంటి సంస్థలను ప్రోత్సహించే పాక్.. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్నామని చెప్పడం అత్యంత హాస్యాస్పదమని ఆగ్రహం వ్యక్తంచేసింది.