అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన ప్రతీకార సుంకాల నుంచి భారత్ ఉపశమనం పొందొచ్చని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. చైనా, మెక్సికో, కెనడాల మాదిరి భారత్‌తో అమెరికా ప్రవర్తించకపోవచ్చని వెల్లడించాయి. ఈ మేరకు ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పంద చర్చలు సజావుగా సాగుతున్నాయని పేర్కొన్నాయి. భారత్‌తో తమకు టారిఫ్ సమస్య మాత్రమే ఉందని వాటిని సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోగలమని అమెరికా వాణిజ్య శాఖకు చెందిన ప్రతినిధుల బృందం వెల్లడించినట్లు తెలిసింది.

ఏప్రిల్ 2 నుంచి అమల్లోకి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన ప్రతీకార సుంకాలు వచ్చేనెల 2 నుంచి అమల్లోకి రానున్న నేపథ్యంలో భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు చర్చలను ముమ్మరం చేశాయి. టారిఫ్‌లపై చర్చించేందుకు ఈనెల మెుదట్లో కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ అమెరికాకు వెళ్లారు. తాజాగా అమెరికా వాణిజ్య శాఖకు చెందిన ప్రతినిధి బృందం దిల్లీలో పర్యటిస్తోంది. కేంద్ర వాణిజ్య శాఖ అధికారులతో వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుపుతోంది.
సజావుగా ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పంద చర్చలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన ప్రతిపాదిత టారిఫ్‌ల నుంచి భారత్ ఉపశమనం పొందొచ్చని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పంద చర్చలు సజావుగా సాగుతున్నాయని పేర్కొన్నాయి. కొన్ని కీలక రంగాలకు చెందిన ఉత్పత్తులపై తక్కువ టారిఫ్ ఉండేలా అమెరికా ప్రతినిధి బృందంతో, కేంద్ర వాణిజ్య శాఖ అధికారులు చర్చలు జరుపుతున్నారని జాతీయ మీడియా పేర్కొంది.
అమెరికా ప్రతీకార సుంకాల వల్ల భారత్‌కు చెందిన 87 శాతం ఉత్పత్తులపై ప్రభావం పడొచ్చని కేంద్ర ప్రభుత్వం జరిపిన అంతర్గత విశ్లేషణలో వెల్లడైనట్లు రాయిటర్స్ కథనం పేర్కొంది. ఈ నేపథ్యంలోనే అమెరికా ఉత్పత్తులపై సుంకాలు తగ్గించేందుకు భారత్ యోచిస్తోందని తెలిపింది. వచ్చేనెల రెండు లోపు వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని ఇరు దేశాలు ప్రయత్నిస్తున్నాయి.