హైదరాబాద్ బోరబండలో ఓ భర్త అనుమానంతో భార్యను గొంతు నులిమి హత్య చేసిన ఘటన కలకలం రేపింది.మహబూబ్‌నగర్‌జిల్లా తాటికొండ గ్రామానికి చెందిన జెట్టెం నరేందర్‌కు 27 ఏళ్ల కిందట రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి ప్రాంతానికి చెందిన పద్మలతతో మ్యారేజ్అయ్యింది. దంపతులు ప్రస్తుతం నగరంలోని రహ్మత్నగర్పరిధిలోని రాజీవ్‌గాంధీనగర్‌లో నివాసం ఉంటున్నారు. వీరికి కుమార్తె సుష్మ, తనయుడు శ్రీమన్నారాయణ ఉన్నారు. కుమార్తె ఎంఎస్కంప్లీట్ చేసి అమెరికాలో ఉంటుంది. కుమారుడు ఢిల్లీ ఐఐటీలో ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు.
ఘర్షణ
నరేందర్ ఓ అనుమానపు పక్షి అని బంధువులు చెబుతున్నారు. పెళ్లైన నాటి నుంచి భార్యను అనుమానించి వేధించి,గొడవలు పెట్టుకునేవాడు. అయినా సరే పిల్లలు కారణంగా పద్మలత ఆ బాధలు భరించింది. అయితే బుధవారం దంపతుల మధ్య ఘర్షణ చెలరేగింది.విచక్షణ కోల్పోయిన భర్త ఆమెను కొట్టాడు. దీంతో కోపంలో ఆమె బ్యాగు సర్దుకుని తన పుట్టింటికి వెళ్లేందుకు సిద్దమైంది. దీంతో నరేందర్ మరింత రెచ్చిపోయాడు.నరేందర్ మరింత కోపంతో ఆమెను గొంతు నులిమి చంపేశాడు. గదిలో బంధించి తలుపులు వేసి, హాల్‌లో నిద్రపోయాడు. తెల్లారిన తర్వాత పాలు పోసి వచ్చాక భార్యను నిద్ర లేపేందుకు వెళ్లాడు. అయితే ఆమె చనిపోయిందని గుర్తించి, నేరుగా బోరబండ పోలీస్‌స్టేషన్‌కి వెళ్లి లొంగిపోయాడు.
పాల వ్యాపారం
భర్త చేసే కిరాణ, పాల వ్యాపారంలో తన వంతు పాత్ర పోషించింది. పిల్లలు ఉన్నత స్థానంలో ఉండాలని ఆమె ఆరాటపడేదని బంధువులు చెబుతున్నారు.

ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు.అయితే నరేందర్ భార్య గొంతు నులిమినప్పుడు ఆమె ముక్కులో నుంచి రక్తస్రావం అయి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. పద్మలతను హత్య చేసిన తర్వాత కూడా నరేందర్ నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. హత్య జరిగిన వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లి ఉంటే ఆమె ప్రాణాలు దక్కేవి అని బంధువులు అంటున్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తీసుకున్న నిర్ణయాలు, ఆవేశంతో చేసిన చర్యలు జీవితాన్ని పూర్తిగా మారుస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య కలహాలు, అనుమానాలు, అసహనం ఇవన్నీ ఆవేశానికి దారి తీస్తాయి . ఆవేశంలో తీసుకునే తప్పుడు నిర్ణయాలు మానసికంగా, శారీరకంగా,బాధిస్తాయి.