ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ మంగళగిరి ప్రజల్ని మరోసారి హత్తుకునేలా మాట్లాడారు. డాన్ బాస్కో స్కూల్లో జరిగిన “మన ఇల్లు – మన లోకేశ్” కార్యక్రమంలో పేదలకు శాశ్వత ఇళ్ల పట్టాలు అందజేశారు. ఆ సమయంలో ఆయన మాటలు అందరినీ ఆలోచింపజేశాయి.“ఇంటిపట్టా ఇవ్వడం కంటే, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం ఆనందమిస్తోందన్నారు లోకేశ్. మంగళగిరి ప్రజలు నన్ను మళ్ళీ గెలిపించడంతో, ఈ సేవా కార్యక్రమాలు ముమ్మరంగా సాగుతున్నాయి,” అని ఆయన తెలిపారు.2019 ఎన్నికలు ఆయనకు కఠిన అనుభవం ఇచ్చాయి. “ఆ ఎన్నికల్లో నేను ఓడిపోతానని ఎవ్వరు ఊహించలేదు. కానీ అప్పట్లో ప్రజలకు దగ్గర కావడం లేకపోయింది. వారి బాధలు అర్థం చేసుకోలేకపోయా. కేవలం 5,300 ఓట్ల తేడాతో ఓడిపోయాను. అదే నా జీవితం మార్చేసింది,” అని లోకేశ్ గుర్తు చేసుకున్నారు.

ఒకే లక్ష్యం – మంగళగిరిని మోడల్ నియోజకవర్గంగా మారుస్తా
అతని మాటల్లో ఎమోషన్ మాత్రమే కాదు, అంకితభావన స్పష్టంగా కనిపించింది. “ఎన్టీఆర్ సంజీవని ద్వారా ఉచిత వైద్యం అందించాం. మహిళలకు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించాం. క్రీడలు ప్రోత్సహించేందుకు మంగళగిరి ప్రీమియర్ లీగ్‌ను ప్రారంభించాం. మొత్తం 26 సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాం,” అన్నారు.
“గెలుపు మీదే… గౌరవం మీదే”
“నా మీద ఎన్ని విమర్శలు వచ్చినా… మీపై నమ్మకం కోల్పోలేదు. అప్పటి ఓటమి తలుచుకుంటూ, ‘ఇంకో సున్నా జోడించి, 53,000 మెజార్టీ ఇవ్వండి’ అని కోరాను. కానీ మీరు అందరి అంచనాలు చెదరగొట్టుతూ 91,000 ఓట్ల మెజార్టీ ఇచ్చారు. ఈ గెలుపు నాది కాదు, మీ ప్రేమ గెలుపు,” అంటూ లోకేశ్ భావోద్వేగంగా స్పందించారు.ఈ కార్యక్రమంలో ప్రజలు లోకేశ్‌ను చూసి ఆనందంతో చప్పట్లు కొట్టారు. మంగళగిరిలో ఆయన సేవల పట్ల ప్రజల భరోసా ఇంకా బలపడుతోంది. “ఇల్లు ఇవ్వడం ఒక భాగం మాత్రమే. మీరు నన్ను గెలిపించిందే అసలైన గౌరవం,” అని లోకేశ్ చివరిగా చెప్పారు.