అనుమానం ఒక కుటుంబాన్ని నాశనంచేసింది.భార్యను కోల్పోయేంత పరాకాష్టకు ఓ భర్త చేరుకున్నాడు.హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించినా, చివరకు పోలీసుల విచారణలో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ దారుణ ఘటన హైదరాబాద్‌లోని అంబర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
అనుమానం పెనుభూతం
అంబర్ పేట పటేల్ నగర్ బిలాల్ మజీదు బస్తీకి చెందిన నవీన్ (32), రేఖ (28) భార్యాభర్తలు. వీరికి ఆరేళ్ల క్రితం వివాహం జరిగింది. ఈ దంపతులకు మారుడు (5), కుమార్తె (3) ఉన్నారు. నవీన్ స్థానికంగా ఓ దుకాణం నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. ఎంతో సాఫీగా సాగుతున్న వీరి కాపురంలో కలతలు చెలరేగాయి. భార్య రేఖపై అనుమానం పెంచుకున్న నవీన్ తరచూ మద్యం సేవించి ఇంటికి వచ్చి భార్యతో గొడవపడేవాడు. దీంతో పెద్దలు కల్పించుకుని ఇద్దరికీ సర్దిచెప్పడంతో కొన్నాళ్లు బాగానే ఉన్నా.. నవీన్‌కు భార్యపై అనుమానం మాత్రం దూరం కాలేదు.ఈ క్రమంలో నవీన్ మళ్లీ వేధించసాగాడు.
దంపతుల మధ్య గొడవ
మార్చి 10వ తేదీ రాత్రి దంపతుల మధ్య మళ్లీ గొడవపడటంతో కోపోద్రిక్తుడైన మద్యం మత్తులో భార్య రేఖను అంతమొందించాలని అనుకున్నాడు.తన బైక్‌లో ఉన్న పెట్రోల్ తెచ్చి అమాంతం భార్య రేఖపై పోసి నిప్పంటించాడు. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో కాసేపటి తర్వాత మంటలు ఆర్పివేసిన నవీన్ అత్తమామాలకు ఫోన్ చేసి రేఖ ఆత్మహత్యకు పాల్పడిందని తెలిపాడు.

నమ్మించే ప్రయత్నం
ఆస్పత్రిలో చేర్చించానని, చికిత్స అందిస్తున్నట్లు నమ్మించే ప్రయత్నం చేశాడు. వెంటనే అక్కడికి పరుగు పరుగున వచ్చిన రేఖ తల్లిదండ్రులు కూతురుని చూసుకుని కుమిలిపోయారు. తీవ్రంగా కాలిపోయిన రేఖ చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం మృతి చెందింది.
కేసు నమోదు
మృతురాలి తండ్రి నారాయణ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నవీన్‌ను అరెస్ట్ చేసి దర్యాప్తు చేపట్టారు.కుటుంబ కలహాలు, అనుమానం, మద్యం మత్తులో జరిగే హింస ఇలా ఎన్నో విషాద ఘటనలకు దారితీస్తున్నాయి.అనుమానంతో బాధపడే వ్యక్తులు కుటుంబ సభ్యుల సహాయం తీసుకోవాలి. భార్యాభర్తలు పరస్పర నమ్మకంతో జీవనం సాగించాలి.