ఏప్రిల్ 1, 2025 నుంచి దేశంలో కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమవుతుంది. దీనిలో భాగంగా ఆదాయపు పన్ను నిబంధనల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. కొత్త ట్యాక్స్ రీతిలో రూ.12 లక్షల వరకు ఆదాయమున్నవారికి పన్ను మినహాయింపు లభించనుంది. ఇది మధ్యతరగతి ప్రజలకు భారీ ఊరటనిచ్చే చర్యగా మారనుంది. పాత ట్యాక్స్ విధానాన్ని ఎంచుకున్న వారిపై మాత్రం పాత నిబంధనలు కొనసాగనున్నాయి.
టీడీఎస్, టీసీఎస్ పరిమితుల్లో మార్పులు
ట్యాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్ (TDS) మరియు ట్యాక్స్ కలెక్షన్ ఎట్ సోర్స్ (TCS) పరిమితుల్లో కొత్త మార్పులు అమల్లోకి రానున్నాయి. ఈ మార్పులు ముఖ్యంగా వ్యాపారులు, పెట్టుబడిదారులపై ప్రభావం చూపుతాయి. అంతర్జాతీయ లావాదేవీలకు సంబంధించి కొత్త టీసీఎస్ రేట్లు అమలవుతాయి. అలాగే, కొన్ని విభాగాల్లో టీడీఎస్ మినహాయింపులు, తగ్గింపులు అందుబాటులోకి రానున్నాయి.

క్రెడిట్ కార్డుల రివార్డ్ పాయింట్లలో మార్పులు
దేశంలోని ప్రముఖ బ్యాంకులు ఎస్‌బీఐ (SBI), యాక్సిస్ బ్యాంక్ (Axis Bank) తమ క్రెడిట్ కార్డుల రివార్డ్ పాయింట్ల విధానంలో మార్పులు చేపట్టాయి. కొన్ని ప్రత్యేక లావాదేవీలకు రివార్డుల కలెక్షన్ తగ్గనుంది. ముఖ్యంగా EMI మార్గంలో కొనుగోలు చేసినప్పుడు రివార్డ్ పాయింట్లు మంజూరు కాకపోవచ్చు. క్రెడిట్ కార్డు వినియోగదారులు తమ బ్యాంక్ నిబంధనలను ముందుగా తెలుసుకుని ప్లాన్ చేసుకోవడం మంచిది.
యూపీఐ సేవల్లో మార్పులు
ఏప్రిల్ 1 నుంచి యూపీఐ (UPI) సేవల్లో కూడా కొన్ని కీలక మార్పులు జరుగనున్నాయి. ఇన్ఫ్ర్యాక్టివ్‌గా ఉన్న మొబైల్ నంబర్లకు, లేదా ఇతరులకు కేటాయించిన నంబర్లకు యూపీఐ సేవలు నిలిపివేయనున్నారు. ఇది బ్యాంకింగ్ భద్రతను పెంచే చర్యగా భావించబడుతోంది. దీని వల్ల అకౌంట్ హోల్డర్లు తమ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్లను అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. యూపీఐ ద్వారా లావాదేవీలు చేసే వినియోగదారులు ఈ మార్పులను గమనించి ముందస్తుగా తగిన చర్యలు తీసుకోవడం అవసరం.