చిన్న ఉద్యోగం అయినా కష్టపడి పని చేస్తాం. అలాంటిది సంవత్సరాలుగా పని చేయకుండానే జీతం తీసుకునేవారిని ఏమనాలి? ఒకటి రెండు రోజులు ఆఫీసుకు వెళ్లకుంటే బాస్ తో అక్షింతలు తప్పవు.. నెలాఖరున జీతంలోనూ ఆమేరకు కోత పడకా తప్పదు. కానీ స్పెయిన్ లో ఓ ఉద్యోగి ఏకంగా ఆరేళ్ల పాటు ఆఫీసు ముఖమే చూడలేదు. వర్క్ ఫ్రం హోం చేశాడని అనుకునేరు.. అసలు పనే చేయలేదు. అయినా నెలనెలా ఠంచనుగా జీతం మాత్రం అందుకున్నాడు. సంస్థలోని రెండు విభాగాల మధ్య సమన్వయ లోపం, ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడడం ఆ ఉద్యోగికి కలిసి వచ్చింది. ఇరవై ఏళ్లుగా సంస్థలో పనిచేస్తున్నందుకు సదరు ఉద్యోగికి సన్మానం చేసే ఏర్పాట్లు చేస్తుండగా ఈ విషయం బయటపడింది. దీంతో ఆ ఉద్యోగిపై కంపెనీ కోర్టుకెక్కింది. స్పెయిన్ లో ఈ వింత ఘటన చోటుచేసుకుంది.

2004 వరకు సక్రమంగా విధులు నిర్వహించాడు
స్పెయిన్ లోని కాడిజ్ మున్సిపల్ వాటర్ కంపెనీలో జోయక్విన్ గార్సియా ప్లాంట్ సూపర్ వైజర్ గా పనిచేశారు. 1990లో ఉద్యోగంలో చేరిన గార్సియా.. 2004 వరకు సక్రమంగా విధులు నిర్వహించాడు. పర్యవేక్షించాల్సిన ఉన్నతాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఈ విషయం గమనించిన గార్సియా.. 2004 నుంచి విధులు ఎగ్గొడుతూ వచ్చాడు.
బ్యాంకు ఖాతాలో నెలనెలా జీతం
డ్యూటీకి వెళ్లకపోయినా ఎవరూ గుర్తించకపోవడంతో గార్సియా జీతం నెలనెలా అతడి బ్యాంకు ఖాతాలో పడింది. ఏడాదికి 41,500 డాలర్లు (మన రూపాయలలో 36 లక్షలు) అందుకుంటూ ఎంజాయ్ చేశాడు. ఆరేళ్లపాటు నిరాటంకంగా సాగిన గార్సియా వ్యవహారం 2010లో బయటపడింది. ఇరవై ఏళ్ల పాటు సంస్థకు సేవలందించిన నేపథ్యంలో గార్సియాకు సన్మానం చేయాలని ఉన్నతాధికారులు ప్రయత్నించడంతో ఈ మోసం బయటపడింది. దీంతో గార్సియాపై కాడిజ్ వాటర్ కంపెనీ కోర్టుకెక్కగా.. ఇటీవల తీర్పు వెలువరించింది. గార్సియాకు 30 వేల డాలర్ల జరిమానా (మన రూపాయలలో 25 లక్షలు) విధిస్తూ తీర్పు చెప్పింది.