హెచ్‌సీయూ భూముల వివాదంతో కాంగ్రెస్‌లో పల్లె నుంచి ఢిల్లీ దాకా చిచ్చు!
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) భూముల వివాదం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో తీవ్రమైన అంతర్గత కలహానికి దారితీస్తోంది. పార్టీ అధిష్ఠానం తరఫున రంగంలోకి దిగిన పరిశీలకురాలు మీనాక్షి నటరాజన్ తీసుకున్న నిర్ణయాలు రాష్ట్ర ముఖ్యనేతకు మింగుడుపడటం లేదు. హెచ్‌సీయూ భూముల వ్యవహారం కీలక దశలోకి వెళ్లడంతో, ఇద్దరి మధ్య వైఖరుల భేదాలు గట్టిగా బయటపడుతున్నాయి. ఈ వివాదం నేతల మధ్య మాటల తూటాలు, మీడియా ద్వారా విమర్శలకు దారితీస్తోంది. దీంతో పార్టీ అంతర్గతంగా తీవ్ర రాజకీయ ఒత్తిడికి లోనవుతున్నది.
అదుపు తప్పిన ఆదాయ ఆశలు – ప్రధాన కారణమేనా?
గచ్చిబౌలిలోని విలువైన 400 ఎకరాల ప్రభుత్వ భూములను తక్కువ ధరకు కార్పొరేట్‌లకు విక్రయించి వేల కోట్ల లాభాన్ని గడించేందుకు కొన్ని కీలక ప్రభుత్వ నేతలు స్కెచ్ వేసినట్టు వార్తలు వెలుగుచూస్తున్నాయి. అయితే విద్యార్థుల నిరసనలు, న్యాయస్థానాల జోక్యం వల్ల ఈ పథకం విఫలమవడంతో, వారికున్న ఆదాయ అవకాశాలు దెబ్బతిని, తీవ్ర అసహనానికి గురయ్యారట. ఇదే సమయంలో కాంగ్రెస్ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ జోక్యం, ఆమె సమీక్షలు, విమర్శలు ముఖ్యనేతను మరింత కోపానికి గురిచేసినట్టు కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి.
అధిష్ఠానం దూతతో పొసగడం లేదు!
ఈ పరిణామాల నేపథ్యంలో, కాంగ్రెస్ పార్టీలో మీనాక్షి నటరాజన్‌పై ప్రధాన నేతకు అనుకూలంగా ఉన్న పత్రికల్లో వ్యతిరేక కథనాలు వెల్లువెత్తుతున్నాయి. ఒక కథనంలో ఆమెను ‘సూపర్ బాస్’గా వర్ణిస్తూ, రాష్ట్రంపై ఢిల్లీ అధిష్ఠానం పెత్తనం నడుపుతోందని తీవ్ర విమర్శలు వచ్చాయి. మరో కథనంలో ఆమె తీరును తెలుగు ఆత్మగౌరవాన్ని దిగజార్చే విధంగా ఉందంటూ వ్యాఖ్యానించడం గమనార్హం. ఈ వార్తలు ఆమె పరిపాలనా తీరును లక్ష్యంగా చేసుకోవడం ద్వారా, పార్టీలో అంతర్గత విభేదాలు బహిర్గతమవుతున్నాయి. నేతల మధ్య ఆధిపత్య పోరాటం ఈ తరహా ప్రచారానికి కారణమవుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు.
తాడోపేడో తేల్చుకోవడానికే సిద్ధం?
కాంగ్రెస్‌లో చోటు చేసుకున్న తాజా పరిణామాల నేపథ్యంలో, మీనాక్షి నటరాజన్ పార్టీ పరువు నిలబెట్టేందుకు ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటుండగా, రాష్ట్రంలోని ముఖ్యనేత మాత్రం ఆమె చర్యలను తన అధికారానికి అడ్డుగాగా భావిస్తున్నట్టు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఆమె తీసుకుంటున్న నిర్ణయాలు, ప్రశ్నించిన విధానం, ముఖ్యనేత పరిపాలనా శైలిపై చెయ్యబడిన వ్యాఖ్యలు ఆయనకు తీవ్ర అసహనాన్ని కలిగించినట్టు సమాచారం. దీంతో ఆమెను ప్రత్యక్షంగా ఎదుర్కొని తాడోపేడో తేల్చుకోవాలనే ఆలోచనలో ఉన్నట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ విభేదం కాంగ్రెస్ రాష్ట్ర రాజకీయాల్లో అనేక దుష్ప్రభావాలకు దారి తీసే అవకాశం కనిపిస్తోంది.
READ ALSO: HCU: గచ్చిబౌలి భూముల విచారణపై 24 కు వాయిదా