అమరావతి: ప్రతి ఆడబిడ్డ ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలను కనాలి.. దీనిపై రాబోయే రోజుల్లో మానిటర్ చేస్తామని ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. తాజాగా ఆయన అసెంబ్లీలో మాట్లాడారు. ముఖ్యంగా మహిళా సాధికారితను మాటల్లో చెప్పడం కాదని.. చేతల్లో చేసి చూపించాలన్నారు. టీడీపీతోనే మహిళా సాధికారిత ప్రారంభమైందని చెప్పారు. మహిళలకు ఆస్తిలో హక్కుకు తొలిసారి ఎన్టీఆర్ కల్పించారని గుర్తు చేసారు.

మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు
తల్లి, చెల్లికి ఆస్తిలో వాటా ఇవ్వని వ్యక్తి గతంలో సీఎంగా ఉన్నారు. ఇచ్చిన ఆస్తిని వెనక్కి తీసుకునేందుకు కోర్టుకు వెళ్లారు. ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తే.. తల్లి, చెల్లికి ఆస్తిలో వాటా ఇవ్వలేదని తెలిపారు. మా ప్రభుత్వ హయాంలో తొలిసారి విద్య, ఉద్యోగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించామని తెలిపారు. దీంతో వారు బాగా చదువుకున్నారు. ప్రస్తుతం మహిళలకే ఎదురుకట్నం ఇచ్చే పరిస్థితి వచ్చింది. ఆడబిడ్డ పుడితే రూ.5వేలు ఫిక్స్ డ్ డిపాజిట్ చేశామని తెలిపారు. స్థానిక సంస్థల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించామని తెలిపారు.
మహిళలకు భద్రత, నమ్మకాన్ని కలిగించాం.
డీలిమిటేషన్ పూర్తయితే దాదాపు 75 మంది మహిళలు అసెంబ్లీకి వస్తారని తెలిపారు సీఎం చంద్రబాబు. పసుపు, కుంకుమ కింద రూ.10 వేల చొప్పున రూ.9,689 కోట్లు ఇచ్చాం. మహిళలకు భద్రత, నమ్మకాన్ని కలిగించాం. తెలుదేశం పార్టీ.. తెలుగింటి ఆడపడుచుల పార్టీ. దీపం-2 కింద 3 సిలిండర్లు ఉచితంగా ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. డ్వాక్రాలో మహిళలు రూపాయి పొదుపు చేస్తే నేనూ రూపాయి ఇచ్చాను. డ్వాక్రా సంఘాల మద్దతుతో 50 లక్షల ఎకరాల్లో ప్రకృతి సేద్యం చేస్తామని సీఎం చంద్రబాబు అన్నారు.