Chandrababu Naidu : వేసవి ప్రణాళికపై సీఎం చంద్రబాబు సమీక్ష వేసవిలో తాగునీటి కష్టాలు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సీఎం చంద్రబాబు అధికారులకు స్పష్టం చేశారు. ముందస్తు ప్రణాళికలు రూపొందించి, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు. ఈ మేరకు నేడు సచివాలయంలో వేసవి ప్రణాళికపై సీఎం సమీక్ష నిర్వహించారు. డిజాస్టర్ మేనేజ్మెంట్, పంచాయతీ రాజ్, మున్సిపల్, ఆరోగ్య శాఖల అధికారులతో సమీక్షించి కీలక ఆదేశాలు జారీ చేశారు. వేసవి కాలంలో తాగునీటి సమస్యలు ఎదురుకాకుండా ముందుగా అన్ని జిల్లాల్లో అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని సీఎం తెలిపారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలకు నీటి సరఫరా ఎటువంటి అంతరాయం లేకుండా ఉండేలా అధికారులు పర్యవేక్షణను కొనసాగించాలని సూచించారు. ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో మార్కెట్లు, బస్ స్టాండ్లు, కూలీల పని ప్రదేశాలు, జనసమ్మర్ధం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ప్రభుత్వ చలివేంద్రాలు, మజ్జిగ పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు.

స్వచ్ఛందంగా చలివేంద్రాలు ఏర్పాటు చేయాలనుకునే వారికి ప్రభుత్వం తరఫున అవసరమైన సహాయం అందించాలన్నారు. 2014-19 నాటికి మాదిరిగా, ఈసారి కూడా ఉచిత మజ్జిగ పంపిణీ చేపట్టాలని ఆదేశించారు. రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లో తాగునీటి సమస్యతో పాటు పశుగ్రాసం కొరత తీవ్రంగా ఉంటుందని గుర్తించిన సీఎం, ఈ ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.35 కోట్లతో 12,138 నీటి తొట్ల నిర్మాణం చేపట్టాలని సూచించారు. పశువులకు తాగునీరు అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులు ఎండలకు గురికాకుండా పాఠశాలల్లో వాటర్ బెల్ విధానం అమలు చేయాలని సీఎం సూచించారు.
తాగునీరు అందుబాటులో ఉండేలా పాఠశాలల్లో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.అలాగే అడవుల్లో అగ్నిప్రమాదాలను నివారించేందుకు ముందుగా చర్యలు తీసుకోవాలని, డ్రోన్ల ద్వారా పర్యవేక్షణను కఠినతరం చేయాలని స్పష్టం చేశారు.మున్సిపాలిటీల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి అవసరమైన రూ.39 కోట్లు విడుదల చేస్తామని సీఎం ప్రకటించారు. గ్రామాల్లో నీటి లభ్యత పెంచేందుకు నరేగా ద్వారా ఫాం పాండ్స్ నిర్మాణం, చెరువుల్లో పూడికతీత పనులను చేపట్టాలని సూచించారు.
వేసవిలో ఉపాధి హామీ కూలీలకు అదనపు పనిదినాలు మంజూరు చేయడంతో పాటు, పనిదినాల్లో నీటి సదుపాయం కల్పించాలని ఆదేశించారు.ఉదయం 6 గంటల నుంచి 11 గంటల లోపు ఉపాధి హామీ కూలీల పనులు పూర్తిచేసేలా చూడాలని సీఎం పేర్కొన్నారు. అలాగే, వారికి అవసరమైన నీటి సౌకర్యాలు అందుబాటులో ఉంచాలని సూచించారు. ప్రజలు వడదెబ్బకు గురికాకుండా అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. మున్సిపల్ కార్మికులు మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బహిరంగ ప్రదేశాల్లో పని చేయకుండా చూడాలని సీఎం సూచించారు. ఆసుపత్రుల్లో వడదెబ్బ బాధితులకు తగినంత సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఇప్పటి నుంచే దోమల నివారణ చర్యలు చేపట్టాలని సీఎం సూచించారు.