హైదరాబాద్ నగరంలో విషాద ఘటన చోటు చేసుకుంది. శుక్రవారం అపార్ట్‌మెంట్ లిఫ్ట్‌లో ఇరుక్కుని తీవ్ర గాయాలపాలైన బాలుడు అర్ణవ్ (6) శనివారం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. రెండున్నర గంటలపాటు నరకయాతన అనుభవించిన బాలుడిని బయటికి తీసి నిలోఫర్ ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే. అయితే, అంతర్గతంగా తీవ్ర రక్తస్రావం కావడంతో శనివారం బాలుడు మృతి చెందాడు.
భయంతో బయటికి వచ్చేందుకు ప్రయత్నం
ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఆగాపురం గోడేకిఖబర్ ప్రాంతానికి చెందిన అజయ్ కుమార్ కుమారుడు అర్ణవ్.. శుక్రవారం మధ్యాహ్నం తాతతో కలిసి రెడ్‌హిల్స్ శాంతినగర్ పార్క్ ఎదురుగా ఉన్న మఫర్ కంఫర్ట్ అపార్ట్‌మెంట్ 3వ అంతస్తులో నివసిస్తున్న మేనత్త వద్దకు వెళ్లాడు. తాత చేతిలో లగేజీ ఉండటంతో బాలుడే లిఫ్ట్ గ్రిల్స్ తెరిచి ముందుగా లోపలికి వెళ్లాడు. అయితే, తాత లగేజీ పెట్టేలోపే లిఫ్టు ఒక్కసారిగా పైకి వెళుతుండటంతో భయంతో బయటికి వచ్చేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో లిఫ్టుకు, గోడు మధ్యలో బాలుడు ఇరుక్కుపోయాడు. కదిలే వీల్లేని పరిస్థితుల్లో గ్రౌండ్ ఫ్లోర్ కు మొదటి అంతస్తుకు మధ్య లిఫ్టు ఆగిపోయింది. అర్ణవ్ లిఫ్టు-గోడకు మధ్యలో నలిగిపోతూ తీవ్రంగా రోదించాడు. తన మనవడిని కాపాడాలంటూ తాత సమీపంలోని వారిని కేకలు వేసి పిలిచాడు. దీంతో అప్రమత్తమైన అపార్ట్‌మెంట్ వాసులు బాలుడిని రక్షించే ప్రయత్నం చేశారు. విద్యుత్ సరఫరాను నిలిపివేసి పోలీసులకు సమాచారం అందించారు.

అపస్మారక స్థితిలోకి ..
పోలీసులతోపాటు డీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. 108 అంబులెన్స్‌ను రప్పించి సహాయక చర్యలు చేపట్టారు. గ్యాస్ కట్టర్‌తో లిఫ్టు గ్రిల్స్‌ను తొలగించే ప్రయత్నం చేయడంతోపాటు బాలుడిని క్షేమంగా బయటకు తీసుకొచ్చేందుకు లిఫ్టు గోడలను బద్దలు కొట్టారు. దాదాపు 90 నిమిషాలపాటు శ్రమించి బాలుడిని బయటకు తీశారు. వెంటనే అతడ్ని నిలోఫర్ ఆస్పత్రికి తరలించారు. అయితే, నడుపు, కడుపు భాగానికి తీవ్రగాయాలు కావడంతో బాలుడు అపస్మారక స్థితిలోకి చేరాడు. బాలుడిని కాపాడేందుకు వైద్యులు తీవ్రంగా శ్రమించినప్పటికీ ఫలితం లేకపోయింది. లిఫ్ట్, గోడకు మధ్యలో నలిగిపోవడంతో అంతర్గతంగా తీవ్ర రక్తస్రావమైనట్లు వైద్యులు తెలిపారు. ఈ క్రమంలోనే శనివారం మధ్యాహ్నం అర్ణవ్ మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు.