మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ కీలక విషయాలను వెల్లడించారు. తన పిల్లలకు తన పూర్తి ఆస్తి సంక్రమించదని స్పష్టం చేశారు. తన ఆస్తిలో కేవలం 1 శాతం లోపే తన కుటుంబానికి ఇవ్వనున్నట్లు తెలిపారు. వారు వారసత్వంగా వచ్చిన ఆస్తి ద్వారా కాకుండా పిల్లలు తమ భవిష్యత్తును తామే నిర్మించుకోవాలని, స్వతంత్రంగా పైకి రావడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఫిగరింగ్ ఔట్ విత్ రాజ్ షామానితో పాడ్‌కాస్ట్‌లో బిల్ గేట్స్ పేర్కొన్నారు. వారసత్వ ఆస్తి కోసం వాళ్లు ఎదురుచూడవద్దు అని ఆయన ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.

గొప్ప విలువలతో పెంచాను
“ఈ అంశంలో ప్రతి ఒక్కరూ నిర్ణయం తీసుకోవాలి. నా పిల్లలకు మంచి విద్యను అందించాను. వారిని గొప్ప విలువలతో పెంచాను. తండ్రి కూడబెట్టిన ఆస్తిపై ఆధారపడకుండా వారు సొంతంగా సంపాదించుకోగలరనే నమ్మకం నాకు ఉంది. నేను సంపాదించిన మొత్తంలో 1 శాతం కంటే తక్కువ పిల్లలకు ఇస్తాను.
వారు సొంతంగా ఎదిగేలా చేయాలి
ఇదేమీ వారసత్వం కాదు. మైక్రోసాఫ్ట్ విధులను నిర్వర్తించమని వారిని అడగను. వారు సొంతంగా సంపాదించుకోవడానికి, విజయం సాధించడానికి అవకాశం ఇవ్వాలని అనుకుంటున్నాను. మన ప్రేమతో వారిని గందరగోళంలోకి నెట్టివేయకూడదు. వారికి కల్పించే అవకాశాలపై స్పష్టత ఇచ్చి, వారు సొంతంగా ఎదిగేలా సిద్ధం చేయాలి” అని బిల్ గేట్స్ అన్నారు.
ఇక బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం… బిల్ గేట్స్ మొత్తం ఆస్తి సుమారు 155 బిలియన్ల డాలర్లుగా ఉంది. ఇందులో ఆయన పిల్లలకు కేవలం 1.55 బిలియన్ డాలర్ల (ఒక శాతం) ఆస్తి మాత్రమే దక్కనుంది. అయితే, తన ఆస్తికి చెందిన ఎక్కువ శాతం విరాళాలకు వెళుతుందని, వారసత్వ సంక్రమణకు చెల్లదని బిల్ గేట్స్ పేర్కొన్నారు.
READ ALSO: Telugu Associations : అమెరికాలో తెలుగు సంఘాల చందాల రగడ