కొద్దిసేపటి క్రితమే ఢిల్లీ ఎన్నికల తేదీలను ఎన్నికల కమిషనర్ ప్రకటించింది. ఈ సందర్బంగా ఈవీఎంల రిగ్గింగ్ జరగలేదని ఈసీ చేసిన ప్రకటనపై ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ తనయుడు సందీప్ దీక్షిత్ స్పందించారు. ఈవీఎంల ట్యాంపరింగ్ జరుగుతున్నదని అయన వ్యాఖ్యానించారు. ఈవీఎంలను రిగ్గింగ్ చేయడం అసాధ్యమని కొద్దిసేపటి క్రితం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుపట్టారు.

న్యూఢిల్లీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ తనయుడు సందీప్ దీక్షిత్ ఈవీఎంలపై మరోసారి విమర్శలు చేశారు. ఈవీఎంల రిగ్గింగ్ అసాధ్యమని ఎన్నికల సంఘం ఎలా చెప్పగలదని ఆయన ప్రశ్నించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూడా ఈవీఎంల రిగ్గింగ్ చోటుచేసుకుందని అన్నారు. ఓట్లు గంపగుత్తగా ఒకే పార్టీకి పడుతున్నా కూడా ఈవీఎంల రిగ్గింగ్ అసాధ్యమని చెప్పడం అమోదయోగ్యం కాదని వ్యాఖ్యానించారు. తాను ఎన్నికల ప్రచారానికి వెళ్లినప్పుడు సామాన్య ప్రజలు చాలా మంది ఈవీఎంల రిగ్గింగ్ గురించి మాట్లాడారని చెప్పారు.
‘మీరెందుకు అనవసరంగా ఓట్లడుగుతున్నారు..? ఓట్లన్నీ గంపగుత్తగా బీజేపీకే పడుతున్నాయిగా. ఈవీఎంలు ఉన్నంత కాలం ఓట్లు బీజేపీకే వెళ్తాయి’ అని సామాన్యులు అంటున్నట్లు సందీప్ దీక్షిత్ తెలిపారు. ఈవీఎంలు ఉన్నంత కాలం బీజేపీ తప్ప మరే పార్టీ గెలువదని సామాన్యులు చెబుతున్నట్లు ఆయన వెల్లడించారు.