Bangkok Earthquake : భూకంప తృటిలో తప్పించుకున్న తెలంగాణ ఎమ్మెల్యే కుటుంబం థాయ్‌లాండ్‌లో సంభవించిన భూకంపం నుంచి తృటిలో బయటపడి తెలంగాణ రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ కుటుంబం క్షేమంగా స్వదేశానికి చేరుకుంది. పెళ్లికి హాజరు కావాలని వెళ్లిన ఈ కుటుంబం అక్కడ భారీ భూకంపానికి గురైంది.శుక్రవారం సంభవించిన ఈ ప్రకృతి విపత్తులో మక్కన్ సింగ్ భార్య, పిల్లలు భయానక పరిస్థితులను ఎదుర్కొన్నారు.అయితే ఎలాంటి ప్రాణనష్టం లేకుండా స్వస్థలానికి చేరుకున్నారు.థాయ్‌లాండ్, మయన్మార్ దేశాల్లో సంభవించిన వరుస భూకంపాలు తీవ్ర నాశనాన్ని మిగిల్చాయి. వందల సంఖ్యలో భవనాలు కుప్పకూలగా, అనేక మంది మరణించారు. జనాలు భయంతో పరుగులు పెట్టారు.

ఈ భయానక పరిస్థితుల్లోనే ఎమ్మెల్యే మక్కన్ సింగ్ కుటుంబం కూడా చిక్కుకుంది.ఈ ఘటనపై ఎమ్మెల్యే భార్య మాట్లాడుతూ – “మేమంతా బ్యాంకాక్ లోని నొవాటెల్ హోటల్‌లో 35వ అంతస్తులో ఉన్నాం.శుక్రవారం ఉదయం భూకంపం రావడంతో భవనం ఊగిపోవడం మొదలైంది. వెంటనే నా పిల్లలతో కలిసి మెట్లు దిగి బయటకు పరుగెత్తాం.భూప్రకంపనలతో పైకప్పు ఊడిపోగా, భవనం ఒకవైపు ఒరిగిపోయింది. మేము బయటకు చేరుకునేలోపే కళ్లెదుటే పక్క భవనాలు నేలమట్టమయ్యాయి. ఆ దృశ్యాన్ని చూడగానే గుండె ఆగినంత పనయ్యింది,” అని ఆమె భావోద్వేగంగా తెలిపారు.తీవ్ర భయానక పరిస్థితుల నుంచి బయటపడి, ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో వారికి ఘన స్వాగతం లభించింది. భార్య, పిల్లలను చూసి ఎమ్మెల్యే భావోద్వేగానికి లోనయ్యారు. ఈ సంఘటన నుంచి సురక్షితంగా బయటపడ్డ తమ కుటుంబం కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.