ఏపీలో వైసీపీ ప్రభుత్వంలో సీఐడీ ఛీఫ్ గా పనిచేసిన పీవీ సునీల్ కుమార్ ను కూటమి ప్రభుత్వం తాజాగా సస్పెండ్ చేసింది. ప్రభుత్వానికి సమాచారం ఇవ్వకుండా విదేశీ పర్యటనలు చేసారన్న ఆరోపణలపై క్రమశిక్షణా ఉల్లంఘన కింద ఆయన్ను సస్పెండ్ చేశారు. దీంతో డీఐజీ స్దాయి అధికారిని ఇలా సస్పెండ్ చేయడంపై మాజీ అఖిల భారత సర్వీసు అధికారుల్లో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మాజీ ఐఏఎస్ పీవీ రమేశ్ తో పాటు పలువురు దీనిపై స్పందించారు.

ప్రభుత్వానికి తెలియదా?
డీఐజీ కాకుండా అడ్డుకునేందుకే పీవీ సునీల్ కుమార్ ను ఇలా కూటమి ప్రభుత్వం సస్పెండ్ చేసిందని బీఆర్ఎస్ నేత, మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ఆయన సెలవు తీసుకున్నప్పుడు ఈ విషయం ప్రభుత్వానికి తెలియదా అని ప్రశ్నించారు. ఆయనేమీ మీలా డిప్లమోటిక్ పాస్ పోర్టుతో ప్రజల డబ్బుతో విదేశాలకు వెళ్లలేదు కదా అని విమర్శలు గుప్పించారు. ఈ రూల్ మిగతా వారికి కూడా అమలు చేస్తే సగం మంది సస్పెండ్ అవుతారన్నారు. అక్కడితే ఆగకుండా చంద్రబాబు, లోకేష్ దావోస్ టూర్ పైనా ప్రవీణ్ కుమార్ ప్రశ్నలు గుప్పించారు.
సునీల్ అరెస్టుపై ఐఏఎస్ పీవీ రమేశ్ స్పందన
మరోవైపు ఏపీలో మాజీ సీనియర్ ఐఏఎస్ పీవీ రమేశ్ మాత్రం పీవీ సునీల్ సస్పెండ్ పై భిన్నంగా స్పందించారు. నేరపూరిత కార్యకలాపాలకు పాల్పడే అధికారులను ప్రతి ఒక్కరూ తీవ్రంగా ఖండించాలన్నారు. అటువంటి నేరాలకు పాల్పడే అధికారులను తగిన ప్రక్రియ తర్వాత సర్వీసు నుండి తొలగించాలన్నారు. తన సొంత భార్యపై తీవ్రమైన నేరాలు చేసిన ఐపీఎస్ అధికారిపై సెషన్స్ కోర్టులో విచారణ జరుగుతోందని, రాజకీయ ప్రోత్సాహం కారణంగా ఆయన పదవిలో కొనసాగారని గుర్తుచేశారు. కులం పేరుతో ఆశ్రయం పొందేందుకు ప్రయత్నించే అటువంటి వ్యక్తులను అందరూ ఖండించాలన్నారు. మతం, కులం, ప్రాంతం ఏదైనా నేరస్థుడు నేరస్థుడే అన్నారు.