అమరావతి: వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడపై మరో కేసు నమోదు అయింది. గుంటూరు నగరం పాలెం పోలీస్ స్టేషన్ లో దువ్వాడపై ఫిర్యాదు చేశారు మాణిక్యాల రావు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన దువ్వాడపై చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదు చేశారు. మాణిక్యాల రావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు. దీంతో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడపై మరో కేసు నమోదు అయింది. ఇక ఈ కేసులో మొదటగా వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసుకు నోటీసులు ఇచ్చే ఛాన్సులు ఉన్నాయని సమాచారం.

రాష్ట్రవ్యాప్తంగా ఆరు కేసులు
మరోవైపు ఇటీవల ఒక్కరోజే దువ్వాడపై రాష్ట్రవ్యాప్తంగా ఆరు కేసులు నమోదైన విషయం తెలిసిందే. పవన్‌పై దువ్వాడ చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని జనసేన నేతలు పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం, అవనిగడ్డ, పామర్రు.గుడివాడ, పెడన, తిరువూరు స్టేషన్లలో దువ్వాడపై ఫిర్యాదులు అందాయి. ఇప్పటికే చంద్రబాబు, పవన్, లోకేష్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో పోసాని అరెస్టు అయ్యారు. పోసానిపై రాష్ట్ర వ్యాప్తంగా 17 కేసులు నమోదయ్యాయి. కాగా పోసాని తరహాలోనే దువ్వాడపైనా కేసులు నమోదు చేస్తున్నారు.
దువ్వాడ పై చట్టపరమైన చర్యలు
దువ్వాడ శ్రీనివాస్ గతంలో చేసిన కామెంట్స్‌పై తాజాగా కేసు నమోదైంది. జనసేన నాయకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దువ్వాడ శ్రీనివాస్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. టెక్కలి నియోజకవర్గ జనసేన ఇన్చార్జి కణితి కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో జనసైనికుల ఫిర్యాదు చేయడంతో దువ్వాడ శ్రీనివాస్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌ను ఎమ్మెల్సీ దువ్వాడ దూషించి,అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదు చేశారు. గతంలో టెక్కలిలోని జనసేన పార్టీ కార్యాలయంపై దాడి చేయించినా అప్పట్లో పోలిసులు చర్యలు తీసుకోలేదని ఈ సందర్భంగా జనసైనికులు ఆరోపించారు. విచారణ జరిపి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు