ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిన నియోజకవర్గం పిఠాపురం. 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పోటీ చేసి ఓడిపోగా, 2024 ఎన్నికల్లో మాత్రం ఘన విజయం సాధించి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఈ విజయానికి ప్రధాన కారణంగా తెలుగుదేశం పార్టీ నేత ఎస్వీఎస్ఎన్ వర్మ కూడా ఎంతో కృషి చేసినట్లు అప్పట్లో చెబుతూ వచ్చారు. అయితే, ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చే హామీపై విభేదాలు మొదలయ్యాయి. దీనిపై ఇప్పుడు జనసేన నేతలు తీవ్ర విమర్శలు చేస్తుండటంతో రాజకీయంగా మరింత రసవత్తరంగా మారింది.

పవన్ కళ్యాణ్ విజయంలో వర్మ కీలక పాత్ర పోషించారని, అందువల్ల ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలి అనే అభిప్రాయం ఉన్నప్పటికీ, టీడీపీ ఇప్పటి వరకు దీనిపై స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదు. టీడీపీ అధినాయకత్వం ఎమ్మెల్సీ పదవి కేటాయించే అధికారం తమదే అని, జనసేన దీనిపై కలుగజేసుకోవాల్సిన అవసరం లేదని భావిస్తోంది. అయితే, జనసేన మాత్రం వర్మకు ఈ హోదా ఇవ్వకపోవడాన్ని పవన్ కళ్యాణ్‌పై తిరుగుబాటు చేసినట్లు చూస్తోంది. ఈ నేపథ్యంలో జనసేన నేతలు నాగబాబు, నాదెండ్ల మనోహర్ వంటి వారు వర్మపై కౌంటర్ అటాక్ చేస్తున్నారు.
పిఠాపురంలో నాగబాబు కీలక సూచన
జనసేన ఆవిర్భావ సభలో నాగబాబు చేసిన వ్యాఖ్యలు పిఠాపురం రాజకీయాల్లో మళ్లీ చర్చనీయాంశంగా మారాయి. “పవన్ గెలిచేలా పిఠాపురం ప్రజలే సహకరించారు. వేరెవరైనా తమ వల్ల గెలిచారని భావిస్తే, అది వారి భ్రమ మాత్రమే.” అని ఆయన వ్యాఖ్యానించడం వర్మను ఉద్దేశించి చేసిన సెటైర్‌గా రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ వ్యాఖ్యలతో నాగబాబు భవిష్యత్తులో మరింత దూకుడుగా వ్యవహరించబోతున్నారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఆయన్నే పిఠాపురం ఇన్‌ఛార్జ్‌గా నియమించబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆయన తరచూ పిఠాపురం పర్యటనలు చేయడమే కాకుండా, స్థానిక పారిశుధ్య కార్మికులను సన్మానించడం వంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ చర్యలు చూస్తే, జనసేన పిఠాపురంలో తమ పట్టును మరింత బలోపేతం చేసుకోవాలని చూస్తోందని స్పష్టంగా అర్థమవుతోంది. ఇప్పటి పరిస్థితులు చూస్తుంటే, జనసేన వర్మపై నేరుగా రాజకీయ దాడి ప్రారంభించినట్లు తెలుస్తోంది. వర్మను టార్గెట్ చేయడం ద్వారా, టీడీపీ నుంచి తమకు స్పష్టమైన మద్దతు లభించాలని జనసేన ప్రయత్నిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. పిఠాపురం వ్యవహారం ఇలా ముదిరితే, భవిష్యత్‌లో జనసేన-టీడీపీ మధ్య బలమైన విభేదాలు ఏర్పడే ప్రమాదం ఉంది. పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో రాజకీయంగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటే, టీడీపీ కూడా ఆ మేరకు తమ వ్యూహాన్ని సెట్ చేసుకుంటుందని భావించాలి.