Amaravati ORR: 121 గ్రామాల మీదుగా అమరావతి ఓఆర్ఆర్ ఏపీ ప్రభుత్వం భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా మార్చేందుకు సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. అమరావతి అవుటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్) నిర్మాణానికి ప్రభుత్వం సన్నాహాలు పూర్తి చేసింది. 189.9 కిలోమీటర్ల పొడవుతో రూపొందించనున్న ఈ ఓఆర్ఆర్, హైదరాబాద్ ఓఆర్ఆర్ కంటే పెద్దదిగా ఉండనుంది.

భూసేకరణకు వేగం
అధికారులు ఇప్పటికే భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేశారు. ఏపీ ప్రభుత్వం, ఎన్ హెచ్ ఏఐ ప్రతిపాదిత ఎలైన్‌మెంట్‌లో మార్పులను పరిశీలిస్తోంది. ఈ రింగ్ రోడ్ నిర్మాణం మొత్తం 23 మండలాల్లో, 121 గ్రామాల మీదుగా కొనసాగనుంది. గుంటూరు, పల్నాడు, కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు జిల్లాల్లోని గ్రామాల మీదుగా ఈ మార్గం విస్తరించనుంది.
ఏఏ ప్రాంతాల మీదుగా ఓఆర్ఆర్ ప్రయాణం?
అమరావతి ఓఆర్ఆర్ గుండా వెళ్లే గ్రామాలపై స్థానిక ప్రజల్లో ఆసక్తి పెరిగింది. ఈ ఓఆర్ఆర్ గుంటూరు జిల్లాలో మంగళగిరి, తాడికొండ, దుగ్గిరాల, తెనాలి, పెదకాకాని, కొల్లిపర, చేబ్రోలు, వట్టిచెరుకూరు మండలాలపై ప్రయాణించనుంది. పల్నాడు జిల్లాలో పెదకూరపాడు, అమరావతి మండలాల్లోని కొన్ని గ్రామాలు ఈ మార్గంలో ఉన్నాయి. ఎన్టీఆర్ జిల్లాలో వీరులపాడు, కంచికచర్ల, జి.కొండూరు, మైలవరం మండలాలను కవర్ చేయనుంది. కృష్ణా జిల్లాలో గన్నవరం, బాపులపాడు, ఉంగుటూరు, కంకిపాడు, తోట్లవల్లూరు మండలాల మీదుగా సాగనుంది. ఏలూరు జిల్లాలో ఆగిరిపల్లి మండలం కూడా ఇందులో భాగమవుతోంది.
అభివృద్ధి దిశగా మరో ముందడుగు
అమరావతి ఓఆర్ఆర్ నిర్మాణంతో భద్రత, కనెక్టివిటీ మెరుగవుతాయని ప్రభుత్వం భావిస్తోంది. రహదారి విస్తరణతో అభివృద్ధికి మరింత బలమైన మద్దతు లభించనుంది. దీని ద్వారా ప్రాంతీయ అభివృద్ధికి మంచి అవకాశం కలగనుంది.